కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో స్పష్టం చేశారు.
రబీ 2024–25 సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికిన బియ్యం (పార్బాయిల్డ్ రైస్) కేటాయించాలని కోరారు. అలాగే ఇప్పటికీ 15.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం CMR (కస్టమ్ మిల్ల్డ్ రైస్)గా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఖరీఫ్ 2024–25 సీజన్‌కు సంబంధించిన CMR డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు.
ప్రస్తుతం మిల్లర్ల వద్ద 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి నిల్వలు ఉన్నాయని, రైలు రేకుల కొరత కారణంగా మొత్తం 13.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు పేరుకుపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల ధాన్యం తరలింపు తీవ్రంగా ప్రభావితమవుతోందని వివరించారు.అలాగే ఖరీఫ్ 2025–26 సీజన్‌కు వరి కొనుగోలు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 36 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రాకుండా వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమే ఉండగా, అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు మరియు సైలోలు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆర్థిక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని లేఖలో కోరారు.