Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: ‘వందేమాతరం’.. భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నినాదం. కానీ, అదే జాతీయ గేయం చుట్టూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో తీవ్ర రాజకీయ, మతపరమైన యుద్ధం రాజుకుంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేదికగా మొదలైన రచ్చ, పార్లమెంట్ దాకా చేరింది. కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడతామని భీష్మించుకుని కూర్చోగా, మొత్తం ఆరు చరణాలూ పాడాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. అసలు జాతీయ గేయంలో మిగిలిన నాలుగు చరణాల్లో ఏముంది? వాటిని పాడేందుకు కాంగ్రెస్ ఎందుకు ససేమిరా అంటోంది.?
ఇటీవల స్వాతంత్ర్య వేడుకలతో పాటు గోవాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమంలో వందేమాతరం ఆలపించిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేసింది. అయితే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) చట్టం, 2026’ ద్వారా 1971 చట్టంలోని సెక్షన్ 3ని సవరించి, జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఉన్నట్టే వందేమాతరానికి కూడా సమాన చట్టపరమైన రక్షణను కల్పించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం పాడటాన్ని అడ్డుకున్నా, పాడే సభకు అంతరాయం కలిగించినా అది నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
వందేమాతరం వెనుక ఉన్న 150 ఏళ్ల చరిత్రను తిరగేస్తే అసలు మూలాలు బయటపడతాయి. 1875లో బంకించంద్ర ఛటోపాధ్యాయ సంస్కృతీకరించిన బెంగాలీలో ‘వందేమాతరం’ను రచించారు. ఆ తర్వాత ఆరేళ్లకు, అంటే 1881లో ఆయన రాసిన ‘ఆనందమఠం’ నవలలో దీనిని చేర్చారు. 18వ శతాబ్దం చివర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు, స్థానిక ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా సన్యాసులు జరిపిన ‘సన్యాసి తిరుగుబాటు’ నేపథ్యమే ఈ నవల. 1905 నుండి 1908 వరకు సాగిన స్వదేశీ ఉద్యమంలో వందేమాతరం ప్రధాన నినాదంగా మారి దేశవ్యాప్తంగా వ్యాపించింది. అయితే, ఆ కాలంలోనే ముస్లిం లీగ్ ఈ గేయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారతమాతకు మొక్కుతున్నాను’ అనే భావన అల్లాను మాత్రమే విశ్వసించే ఇస్లాం మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధమని, ఇది విగ్రహారాధన కిందికే వస్తుందని వాదించింది.
Also Read
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ అంతర్గతంగా చర్చలు ప్రారంభించింది. సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు ఈ గేయాన్ని సంపూర్ణంగా సమర్థించగా, జవహర్లాల్ నెహ్రూ తదితరులు రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయాన్ని కోరారు. దానికి స్పందించిన ఠాగూర్ నెహ్రూకు రాసిన లేఖలో.. మొదటి భాగంలో ఉన్న భక్తి, మాతృభూమి సౌందర్య వర్ణన అద్భుతంగా ఉన్నాయని, మిగిలిన భాగాన్ని దీంతో ముడిపెట్టాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఆనందమఠం నవల సందర్భంతో కలిపి చదివితే అది ముస్లింల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని, కాబట్టి స్వచ్ఛందంగా మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా పరిగణించవచ్చని తేల్చారు. ఫలితంగా 1937 అక్టోబర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారిక తీర్మానం చేసి, మిగిలిన చరణాలు ఇతర మత సమూహాల భావజాలానికి అనుగుణంగా లేవని, తొలి రెండు చరణాలనే పాడాలని నిర్ణయించింది.
మహాత్మా గాంధీ సైతం 1939 జూలై 1న, అదే నెలలో ప్రచురితమైన ‘హరిజన్’ పత్రికలోనూ దీనిపై రాశారు. ఎక్కడైనా ఎవరైనా అభ్యంతరం చెబితే సభల్లో వందేమాతరం పాడటాన్ని విరమించుకోవాలని స్పష్టం చేశారు.
అసలు వందేమాతరం మిగిలిన నాలుగు చరణాలపై ఇంతటి తీవ్ర అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమయ్యాయనేది ఆసక్తి రేపుతున్న అంశం.వందేమాతరం మూడో చరణంలో మాతృభూమి రక్షణ కోసం కత్తులు పట్టే ‘కోట్లాది చేతుల’ ప్రస్తావన వస్తుంది. ఇక నాలుగో చరణంలో ప్రతి ఆలయంలోనూ కొలువైనది భరతమాత రూపమేనని చెబుతూ.. ఐదో చరణంలో మాతృభూమిని దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిలతో ప్రత్యక్షంగా పోల్చారు. ఆనందమఠం నవలలో ముస్లింలను శత్రువులుగా చూపే యుద్ధ పిలుపుగా ఈ భాగాలు మారాయని, దేశాన్ని హిందూ దేవతగా మార్చడం ముస్లింలలో పరాయీకరణ భావనను తెచ్చిందని చరిత్రకారులు చెప్తుంటారు. అల్లాను తప్ప మరెవరినీ పూజించని సిద్ధాంతానికి ఈ దేవతల ఆవాహన విరుద్ధమన్నది ముస్లిం పెద్దల ప్రధాన వాదన.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని జాతీయ గేయంగా ఎంపిక చేసే సమయంలో రాజ్యాంగ సభలో తీవ్ర ఘర్షణే జరిగింది. 1947 ఆగస్టు 14 అధికార బదిలీ వేడుకలో సుచేతా కృపలానీ వందేమాతరం తొలి చరణాన్ని పాడారు. అయితే ఆగస్టు 26న హెచ్.వి. కామత్ సభలో మాట్లాడుతూ.. ఆ పాట పాడే సమయంలో పలువురు సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభ వెలుపలే ఉండి, పాట ముగిశాక లోపలికి వచ్చారని ఆరోపించారు. నెహ్రూ మాత్రం వందేమాతరం ఆర్కెస్ట్రాకు అనుకూలంగా ఉండదన్న కారణంతో జనగణమన వైపు మొగ్గు చూపారు.
1948 నవంబర్ 5న సేథ్ గోవింద్ దాస్ దాన్ని తిరస్కరిస్తూ నిపుణులతో సంగీతం సమకూర్చవచ్చని వాదించారు. చివరకు 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. ‘జనగణమన’ జాతీయ గీతమని, దానికి సమాన హోదా కల్పిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిన ‘వందేమాతరం’ జాతీయ గేయంగా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనవరి 28న అధికారిక కార్యక్రమాల్లో మొత్తం ఆరు చరణాలనూ ఆలపించాలంటూ నూతన నిబంధనలను నోటిఫై చేసింది. కాంగ్రెస్ దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ వాదనను తోసిపుచ్చారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ మొదటి రెండు చరణాలను మాత్రమే ఆమోదించిందని, 2025 డిసెంబర్లో పార్లమెంట్లో కేవలం చర్చ మాత్రమే జరిగిందని, పూర్తి వందేమాతరం పాడాలని ఎలాంటి తీర్మానం చేయలేదని గుర్తుచేశారు. పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రధాని, హోంమంత్రి ఏకపక్ష నోటిఫికేషన్ ద్వారా మొత్తం గీతాన్ని రుద్దుతున్నారని ఆయన విమర్శించారు.
1875లో పుట్టి, 1905 నాటి స్వాతంత్ర్య సమరంలో వేలాది మంది ప్రాణత్యాగాలకు ప్రేరణగా నిలిచిన ఒక చారిత్రక గేయం.. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా రాజకీయ సిద్ధాంతాల నడుమ నలిగిపోతోంది. ‘వందేమాతరం’ అంటే కేవలం ఒక గేయం మాత్రమే కాదు.. ఈ దేశపు విభిన్న రాజకీయ, మతపరమైన చరిత్రకు నిలువెత్తు దర్పణం. ఈ వివాదం జాతీయతా భావానికి గీటురాయా లేక ఎన్నికల రాజకీయాల చదరంగంలో ఒక పావుగా మారిందా అన్నది ప్రజలే తేల్చుకోవాలి.
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!