Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!

Indian Rich American Poor Comparison

Indian Rich American Poor Comparison

భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం దూసుకుపోతున్నామని మనం ఎప్పుడూ సంబరపడుతుంటాం. కానీ, ఒకసారి గ్లోబల్ లెవెల్‌లో మన రియాలిటీ ఏంటో చూస్తే గుండెలు గుబేలుమంటాయ్! మనం ఎంతో గొప్పగా అనుకుంటున్న మన సంపద, మన ఆదాయాలు ప్రపంచ స్థాయి ముందు ఏమాత్రం సరిపోవట్లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని అత్యంత పేదవారు కూడా, మనదేశంలోని అత్యంత ధనికుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం..! అసలు ఈ ఆర్థిక వ్యత్యాసాలకు కారణమేంటి? మనం ఎక్కడ వెనుకబడ్డాం?.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంపాదన, జీవన ప్రమాణాలు లాంటి వాటిపై ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది.’పావర్టీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ ప్లాట్‌ఫామ్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలున్నాయి. అత్యంత సంపన్న దేశాలలోని అట్టడుగు పేదల జీవన ప్రమాణాలు, భారత్ లాంటి దేశాల అగ్రశ్రేణి ధనికుల కంటే మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. కొన్ని అగ్రరాజ్యాలలోని 10 శాతం మంది పేదల రోజువారీ ఖర్చు లేదా ఆదాయం… భారత్‌లోని టాప్ 10 పర్సెంట్ సంపన్నుల కంటే ఎంతో ఎక్కువ. భారత్‌లో అత్యంత ధనిక వర్గాల రోజువారీ వినియోగం లేదా ఆదాయ పరిమితి ఒక్కో వ్యక్తికి కేవలం 10 డాలర్లుగా ఉంటే, అమెరికాలో ఈ అట్టడుగు పేదల ఆదాయమే 25 డాలర్లుగా ఉంది.

ఈ ఆర్థిక అంతరం ఏ స్థాయిలో ఉందో ఈ అంకెలను చూస్తేనే స్పష్టమవుతుంది. కెనడాలో అట్టడుగులో ఉన్న పేదల రోజువారీ ఆదాయం 31 డాలర్లుగా ఉంది. జర్మనీ, ఆస్ట్రేలియాలలో ఇది 28 డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో.. మనదేశంలో అత్యంత సంపన్నమైన టాప్ 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం కేవలం 10 డాలర్లు మాత్రమే. కానీ ఇదే సంపన్న వర్గాల ఆదాయం అమెరికాలో ఏకంగా 173 డాలర్లుగా నమోదైంది. కెనడా, ఆస్ట్రేలియాలలో 129 డాలర్లుగానూ, జర్మనీలో 128 డాలర్లుగానూ ఉంది.

కానీ మన దేశం విషయానికి వస్తే ఈ అంకెలు పూర్తి తారుమారయ్యాయి.భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం, మన దేశంలో నెలకు రూ. 80,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి దేశంలోని టాప్ 10 సంపన్న ఆదాయ వర్గాల జాబితాలో ఉంటాడు. అంటే, దేశంలోనే అత్యున్నత ఆదాయ వర్గంగా పరిగణించబడుతున్న ఈ స్థాయి వ్యక్తుల జీవన ప్రమాణాలు కూడా… పశ్చిమ దేశాల్లో అట్టడుగున ఉన్న పేదల జీవన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

భారత్ ఎదుర్కొంటున్న అసలు సమస్య కేవలం పేదరికం మాత్రమే కాదు. వ్యవస్థ అంతటా వేళ్లూనుకుపోయిన ‘తక్కువ ఆదాయాలు’.భారత్‌లో 10 డాలర్లు ఖర్చు చేయగలిగితే ఒక వ్యక్తిని అత్యంత ధనిక వర్గంలో ఒకరిగా గుర్తిస్తారు. కానీ కెనడా, జపాన్, అమెరికా వంటి దేశాలలో అదే 10 డాలర్ల మొత్తం ఒక వ్యక్తిని అట్టడుగున ఉన్న పేద 10 శాతం మందిలో నిలబెడుతుంది.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పేద భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా అవసరం.అయితే.. అదొక్కటే మన దేశాన్ని సంపన్న దేశంగా మార్చలేదు. ఒకవేళ పేద భారతీయులు నేడు మెరుగ్గా ఉన్న ఇళ్ల స్థాయికి చేరుకున్నప్పటికీ, వారి జీవన ప్రమాణాలు సంపన్న దేశాల ప్రజలతో పోలిస్తే చాలా వెనుకబడిపోతాయి. అందువల్ల.. కేవలం పేదలకు, ధనికులకు మధ్య దూరాన్ని తగ్గించడంపైనే కాకుండా, జనాభా మొత్తానికి ఆదాయాలను పెంచడంపైన భారత్ దృష్టి పెట్టాలి.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆదాయం పెరగాలన్నా ఉత్పాదకత పెరగడం ఒక్కటే మార్గం.భూమి, శ్రమ, మూలధనాన్ని ఉపయోగించి ఎక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా.. అధిక వేతనాలు పొందొచ్చు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పెరుగుతున్న గృహ అవసరాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఖర్చు చేయగలిగే సత్తా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, వ్యాపారాలను సులభంగా ప్రారంభించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పన్నులు సహేతుకంగా ఉండటానికి, అనవసరమైన నిబంధనల భారాన్ని తగ్గించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి.

దేశంలో ధనికులకు, పేదలకు మధ్య అంతరం తగ్గడం ఎంత ముఖ్యమో, యావత్ దేశ ప్రజల కొనుగోలు శక్తిని, ఉత్పాదకతను పెంచడం కూడా అంతే ముఖ్యం. కేవలం కొద్దిమంది సంపన్నుల సంఖ్య పెరిగినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందదు. ప్రతి పౌరుడి జేబులో తగినంత ఆదాయం పడినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది.

:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)