Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డోలు-సన్నాయి దరువులు మోగుతున్నాయి. తాళాల శబ్దాల మధ్య గులాల్ గాల్లోకి ఎగురుతోంది. ఊరంతా పూల వాన కురుస్తోంది. ఆ పూల వాన మధ్య రాజఠీవితో అలంకరించిన ఒక రథం కదులుతోంది. ఆ రథంలో ఒక తల్లి, ఆమె ఒడిలో అప్పుడే కళ్లు తెరిచిన ఒక పసిపాప. ఆ పాప పేరు ‘గార్గి’. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఈ అపూర్వ ఘట్టానికి వేదికయ్యాయి.
సాధారణంగా గ్రామాల్లో నాయకులు గెలిచినప్పుడో, దేవుడి ఉత్సవాలప్పుడో ఊరేగింపులు చూస్తుంటాం. కానీ ఒక ఆడపిల్ల పుట్టిందని, ఆ పసికందును ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురావడానికి రథాన్ని సిద్ధం చేసి, ఊరంతా పండుగ చేయడం బహుశా చరిత్రలోనే అరుదు. దాదాపు 200 ఏళ్లుగా, నాలుగు తరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల అన్న మాటే వినిపించలేదు. రెండు శతాబ్దాల ఆకలిని తీరుస్తూ ‘గార్గి’ పుట్టింది. తమ ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని బామ్మ సురేఖా దహిఫలే కన్నీటిపర్యంతమయ్యారు. ఈ బిడ్డను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని తాత లింబాజీ దహిఫలే ఉప్పొంగిపోయారు.
ఈ వార్త వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది. కానీ, ఈ రథయాత్ర సాగిన ఆ నేల… భారతదేశంలోనే ఆడపిల్లల పాలిట అత్యంత ప్రమాదకరమైన ‘కబేళా’ అన్న కఠిన వాస్తవాన్ని మనం విస్మరించలేం.
Also Read
పర్లీలో పూల వర్షం కురిసిన అదే వీధుల్లో… గతంలో బావుల్లో, ముళ్లపొదల్లో, ఆసుపత్రి వెనుక చెత్తకుప్పల్లో కుక్కలు పీక్కుతిన్న ఆడ పిండాల నెత్తుటి వాసన ఇంకా పూర్తిగా పోలేదు. ఇది కేవలం ఒక కుటుంబ సంబరం మాత్రమే కాదు.. ఆడపిల్లల సమాధులపై నిలబడి సాగిన ఒక నిశ్శబ్ద ప్రతిఘటన.
గార్గి జన్మించిన పర్లీ పట్టణానికి భారతదేశ నేర చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఉంది. సరిగ్గా 2012 మే లో, విజయమాల మాథే అనే మహిళ ఇదే పర్లీలో ఒక ప్రైవేట్ క్లినిక్‌లో అబార్షన్ చేయించుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు వెలుగులోకి వచ్చిన నిజాలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. డాక్టర్ సుదామ్ ముండే, ఆయన భార్య సరస్వతి ముండేలు ఆసుపత్రి ముసుగులో నడిపింది వైద్యాలయం కాదు, ఒక క్రూరమైన నరహత్యల కేంద్రం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేసి, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా గర్భస్రావాలు చేసేవారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన భయానక వాస్తవం ఏమిటంటే… అబార్షన్ చేసిన తర్వాత ఆ పిండాలను గుర్తించకుండా ఉండటానికి తమ ఫామ్‌హౌస్‌లోని పెంపుడు కుక్కలకు ఆహారంగా వేసేవారు.
మరికొన్ని పిండాలను పక్కనే ఉన్న బావుల్లో, చెత్త దిబ్బల్లో పారబోసేవారు. వందలాది, వేలాది మంది ఆడపిల్లలను భూమి మీద పడకముందే తుదముట్టించిన ఈ దంపతులు చివరకు అరెస్ట్ అయ్యి దోషులుగా తేలారు. ఆ భయానక ఘటనలు జరిగి దశాబ్దాలు గడుస్తున్నా, ఆ ప్రాంతంలో నేటికీ ఆడపిల్లల పుట్టుక చుట్టూ అలుముకున్న దురాచారపు ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు.
ఈ ప్రాంతంలో లింగ వివక్ష ఎంతటి లోతైన విషవృక్షమో అర్థం కావాలంటే అధికారిక గణాంకాలను పరిశీలించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం బీడ్ జిల్లాలో వెయ్యి మంది బాలురకు కేవలం 801 మంది బాలికలు మాత్రమే ఉండేవారు. అంటే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి సుమారు 200 మంది ఆడపిల్లలను గర్భంలోనే అంతం చేసేశారు. ఇది దేశంలోనే అత్యంత దయనీయమైన నిష్పత్తుల్లో ఒకటి.
ముండే దంపతుల అరెస్టు, ప్రభుత్వాల నిఘా, PCPNDT చట్టాన్ని కఠినతరం చేయడం వల్ల పరిస్థితి కొంత మెరుగుపడినట్లు కనిపించినా, ఆ మార్పు తాత్కాలికమేనని తేలిపోయింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన గణాంకాల ప్రకారం కూడా బీడ్ జిల్లాలో బాలల లింగ నిష్పత్తి వెయ్యి మంది బాలురకు దాదాపు 865 బాలికల స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. సాధారణంగా ప్రకృతిసిద్ధంగా ఉండాల్సిన 950 కంటే ఎక్కువ నిష్పత్తితో పోలిస్తే ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. వైద్య సాంకేతికతను చట్టవిరుద్ధంగా వాడుకుంటూ, సరిహద్దు జిల్లాలకు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణలు చేయించుకునే దందా ఇప్పటికీ భూగర్భంలో కొనసాగుతోందనే చేదు నిజాన్ని ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
బీడ్ జిల్లాలో స్త్రీలపై సాగుతున్న అణచివేత కేవలం గర్భంలోనే ఆగిపోవడం లేదు; ఆమె పుట్టి పెరిగిన తర్వాత కూడా వ్యవస్థ ఆమెను నిలువునా పిండేస్తోంది. ఈ జిల్లా ప్రధానంగా వర్షాభావ, కరవు ప్రాంతం. ఉపాధి లేక ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు లక్షలాది మంది దంపతులు పశ్చిమ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని చెరుకు తోటల్లో కూలీలుగా పనిచేయడానికి వలస వెళ్తారు. అక్కడ కాంట్రాక్టర్లు భార్యాభర్తలను కలిపి ఒక ‘జోడీ’గా మాత్రమే పనిలోకి తీసుకుంటారు. నెలసరి సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకుంటే రోజువారీ వేతనం కోత పడుతుంది, భారీగా జరిమానాలు విధిస్తారు.
ఈ క్రూరమైన ఆర్థిక దోపిడీ నుంచి తప్పించుకోవడానికి, శారీరక శ్రమను నిరంతరం కొనసాగించడానికి బీడ్ జిల్లాలో వేలాది మంది యువతులు 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే శస్త్రచికిత్సల ద్వారా గర్భాశయాలను తొలగించుకుంటున్నారు. ఈ దారుణం వెనుక అపరిమితమైన పేదరికం, వరకట్న దురాచారం, అప్పుల ఊబి ఉన్నాయి. ఆడపిల్ల పుడితే పెళ్లికి కట్నం ఇవ్వలేమనే భయం, చెరుకు తోటల నరకయాతన కలిసి… స్త్రీ ఉనికిని ఒక ఆర్థిక భారంగా చూసే కుళ్లిన వ్యవస్థ ఇక్కడ వేళ్లూనుకుపోయింది. అలాంటి గడ్డ మీద ఒక ఆడపిల్లను ‘పువ్వులా చూసుకుంటాం’ అని ఒక కుటుంబం చెప్పడం విప్లవాత్మకమైన మార్పే.
గార్గిని ఎక్కించిన రథం పర్లీ వీధుల్లో సాగిపోతుంటే జనం చప్పట్లు కొట్టారు, పూలు చల్లారు. కానీ ఆడపిల్ల పుట్టుక ఒక కుటుంబానికి ‘అదృష్టం’గా మారడానికి రెండు వందల ఏళ్లు నిరీక్షించాల్సి రావడం మన నాగరిక సమాజపు నైతిక పతనానికి నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, ఆడపిల్లల సంరక్షణకు ఎంతటి పథకాలు తెచ్చినా… సమాజం తన కపట సంప్రదాయాల సంకెళ్లను తెంచుకోనంత వరకు మార్పు సాధ్యం కాదు.
:- ( CLN RAJU – EDITOR NTV Digital)
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!