Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్‌లో మిడిల్‌క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?

What Is Debt Trap Explained

What Is Debt Trap Explained

మీ జీతం 50000 రూపాయలనుకోండి. ప్రతి నెల ఈఎంఐలకే ఆ 50000 రూపాయలు వెళ్లిపోతే…? ఇంటి అద్దె ఎవరు కడతారు? పిల్లల ఫీజులు ఎలా చెల్లిస్తారు? కిరాణా ఎలా వస్తుంది? ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో వేల కుటుంబాలది. తాజాగా విడుదలైన ఎక్స్‌పర్ట్ ప్యానెల్ సర్వే చూస్తే… అప్పు తీసుకోవడం కంటే ఆ అప్పు నుంచి బయటపడటమే పెద్ద యుద్ధంగా మారిపోయిందని అర్థమవుతోంది.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతల్లో 60శాతం మందికి ప్రతి నెల చెల్లించే ఈఎంఐలు వారి కుటుంబ నెలవారీ ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయని సర్వే చెబుతోంది. అంటే జీతం వచ్చిన కొద్ది గంటల్లోనే మొత్తం డబ్బు బ్యాంక్ ఖాతా నుంచి ఈఎంఐల రూపంలో వెళ్లిపోతోంది.

ఆ తర్వాత కుటుంబ ఖర్చుల కోసం మళ్లీ అప్పు వెతకాల్సిన పరిస్థితి. సమస్య ఇక్కడితో ఆగడం లేదు. 40శాతం మంది పాత ఈఎంఐలు చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకుంటున్నామని లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు. ఆ అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు. ఇలా తిరుగుతూనే ఉండే ఈ చక్రాన్నే ఆర్థిక నిపుణులు డెట్ ట్రాప్ అంటారు. మొదట లక్ష రూపాయలతో మొదలైన రుణం… కొద్ది నెలల్లో వడ్డీలు, పెనాల్టీలు కలిసేసరికి భారంగా మారిపోతోంది.

చాలామందికి ఒక సందేహం వస్తుంది. ప్రజలు ఇన్ని అప్పులు తీసుకుంటున్నారంటే ఖరీదైన ఫోన్లు, కార్లు, విలాసాల కోసమేనా అని డౌట్ వస్తుంది. అయితే ఈ సర్వే మాత్రం మరో కథ చెబుతోంది. మొత్తం రుణాల్లో 26శాతం వైద్య అత్యవసర పరిస్థితుల కోసం తీసుకున్నవే. ఒక్కసారిగా కుటుంబంలో ఎవరికైనా గుండె ఆపరేషన్, ప్రమాదం, క్యాన్సర్ చికిత్స అవసరమైతే లక్షల్లో ఖర్చవుతోంది. ఆరోగ్య బీమా సరిపోకపోతే చివరి దారి అప్పే.

మరో 22శాతం మంది పిల్లల చదువు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. 18శాతం మంది ఉద్యోగం పోవడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా 15శాతం మంది రోజువారీ ఇంటి ఖర్చులు నిర్వహించడానికే రుణాలు తీసుకున్నారు. అంటే సంపాదన కంటే జీవన వ్యయం వేగంగా పెరుగుతోందని ఈ సంఖ్యలు చెబుతున్నాయి. ఇక ఈఎంఐలు ఎందుకు చెల్లించలేకపోతున్నార అనే ప్రశ్నకు కూడా సర్వే సమాధానం ఇచ్చింది. దాదాపు 33శాతం మంది ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గిపోవడమే కారణమని చెప్పారు. 28శాతం మంది తమ ఆదాయంతో పోలిస్తే ఈఎంఐలు చాలా ఎక్కువయ్యాయని చెప్పారు. 19శాతం మంది ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరో 12శాతం మంది వైద్య లేదా కుటుంబ అత్యవసర పరిస్థితులు తమ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని వివరించారు.

ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 60శాతం మంది కట్టాల్సినదాంట్లో మినిమం మాత్రమే చేస్తున్నారు లేదా ఈఎంఐలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా అందాయి.

డబ్బు సమస్య ఒక వైపు ఉంటే… మానసిక ఒత్తిడి మరో వైపు పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 35శాతం మంది రుణ వసూళ్ల సమయంలో వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరో 17శాతం మంది బెదిరింపులు, పదేపదే ఫోన్ కాల్స్, ఇంటి వద్దకు వెళ్లి ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన అనుభవాలను పంచుకున్నారు. మన చుట్టూ కూడా ఇలాంటి కుటుంబాలు చాలానే కనిపిస్తాయి. ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం, ఉద్యోగం ఒక్కసారిగా పోవడం, చిన్న వ్యాపారం నష్టాల్లో పడిపోవడం, వెంటనే పర్సనల్ లోన్, తర్వాత క్రెడిట్ కార్డు, ఆ తర్వాత మరో లోన్. చివరకు జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతుంది. ఇదే ఇప్పుడు వేలాది మధ్యతరగతి కుటుంబాల వాస్తవం. ఇక ఎక్స్‌పర్ట్ ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా చెప్పిన మాట ఆలోచింపజేస్తుంది. భారత్‌లో అప్పుల సమస్య ఇప్పుడు ఈఎంఐలు మిస్ అవడానికే పరిమితం కాలేదని, చాలా మంది సాధారణ కుటుంబాలు వైద్య అత్యవసర పరిస్థితులు, ఉద్యోగ నష్టం, ఊహించని జీవిత సంఘటనల వల్ల ఈ స్థితికి చేరుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకే రుణగ్రహీతలను రక్షించే వ్యవస్థతో పాటు చట్టబద్ధమైన రుణ వసూళ్ల మధ్య సమతుల్యత అవసరమని సూచించారు.

ఈ సర్వే ఒక హెచ్చరిక లాంటిది. అప్పు తీసుకోవడం కంటే… అప్పు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించడం ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం… ఎన్నో సంవత్సరాల ఆర్థిక స్వేచ్ఛను దూరం చేసే ప్రమాదం ఉంది.