Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?

Consanguineous Marriage

Consanguineous Marriage

Consanguineous Marriage: హేతువాదం గురించి మాట్లాడతారు. శాస్త్రీయ దృక్పథం గురించి ఉపన్యాసాలిస్తారు. ఉత్తర భారతంలోని సామాజిక వెనుకబాటుతనాన్ని విమర్శిస్తారు. అయితే వారి ఇళ్లలో, వారి కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతున్న కొన్ని ఆచారాలను ప్రశ్నించాల్సి వస్తే మాత్రం సంప్రదాయం అనే ముసుగు వేసుకుంటారు. ముఖ్యంగా మేనరికపు వివాహాల విషయంలో దక్షిణ భారతం చూపిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి నిజంగా సిగ్గుపడాల్సిన వాస్తవం.

ప్రపంచం జన్యుశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు చేస్తుంటే, సౌతిండియన్స్ మాత్రం కుటుంబ బంధాల పేరుతో ఒకే పూర్వీకుల నుంచి వచ్చిన జన్యు వారసత్వంలోనే వివాహాలను కొనసాగిస్తున్నారు. పైగా కుల పిచ్చి కూడా దక్షిణ భారతంలో చాలా ఎక్కువే. అందుకే తమ కులంవారికే ఇచ్చి పెళ్లి జరిపించాలనే ఆలోచనతో తమ కుటుంబసభ్యులకే ఇచ్చి పెళ్లి చేసేవారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే సమాజానికి కులం ఎక్కువే కావచ్చు కానీ.. జన్యువులకు కులం తెలియదు. అది పనిచేసేది జీవశాస్త్ర నియామల ప్రకారమే కులంతో సైన్స్‌కి పనిలేదు. మరోవైపు దగ్గరి రక్త సంబంధీకుల వివాహాలతో ప్రతికూల ప్రభావాల వస్తాయని సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన వేళ ఈ అంశంపై చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన డేటా చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది. డేటా ఏం చెబుతోంది?

దగ్గరి రక్త సంబంధీకుల వివాహాల వల్ల జరిగే నెగిటివ్‌ హెల్త్‌ ఎఫెక్ట్స్‌పై అవగాహన కల్పించాలని, అవసరమైతే చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలని కూడా సూచించింది. అయితే వివాహం వ్యక్తిగత ఎంపిక అని, దానిపై నియంత్రణ విధించడం చట్టసభల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఈ వివాహాలను నిషేధిస్తూ తీర్పు ఇవ్వలేదు. వాటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరాన్ని మాత్రం బలంగా గుర్తుచేసింది.

నిజానికి మన శరీరంలో దాదాపు 20 వేల ప్రోటీన్ తయారీ జన్యువులు ఉంటాయి. తల్లి నుంచి ఒకటి, తండ్రి నుంచి మరొకటి.. ప్రతి జన్యువుకు రెండు కాపీలు అందుతాయి. వీటిలో కొన్ని జన్యు మార్పులు వ్యాధులకు కారణమవుతాయి. ఒక్క కాపీలో మాత్రమే అలాంటి మార్పు ఉంటే చాలామందిలో వ్యాధి బయటపడదు. వాస్తవానికి దగ్గరి రక్త సంబంధీకులైన ఇద్దరి శరీరాల్లో ఒకే రకమైన వ్యాధికి కారణమయ్యే జన్యువులు ఉండే అవకాశం ఎక్కువ. వారిద్దరూ ఆరోగ్యంగానే కనిపించినా, ఆ జన్యువులు బిడ్డకు ఇద్దరి నుంచీ అందితే వ్యాధి బయటపడవచ్చు. దీన్నే ఆటోసోమల్ రిసెసివ్ వారసత్వం అంటారు.

తల్లిదండ్రులిద్దరూ ఒకే రిసెసివ్ వ్యాధికి వాహకులైతే ప్రతి గర్భధారణలోనూ బిడ్డకు వ్యాధి వచ్చే అవకాశం 25 శాతం ఉంటుంది. అంటే బయటకు ఆరోగ్యంగా కనిపించే ఇద్దరు వ్యక్తులు కూడా తమ సంతానానికి తీవ్రమైన జన్యుపరమైన సమస్యను అందించవచ్చు. కజిన్స్ మధ్య జరిగే వివాహంలో పుట్టే పిల్లలకు సగటున 6.25 శాతం జన్యు ప్రాంతాలు ఒకే పూర్వీకుడి నుంచి వచ్చినవిగా ఉండవచ్చు.

దీన్ని ఇన్‌బ్రీడింగ్ కోఎఫిషియెంట్ అంటారు. సంబంధం లేని తల్లిదండ్రుల పిల్లల్లో తీవ్రమైన పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం సుమారు 2 నుంచి 3 శాతం ఉంటే, మొదటి వరుస కజిన్స్ పిల్లల్లో అది 4 నుంచి 6 శాతం వరకు ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. థలసేమియా, కండరాలను క్రమంగా బలహీనపరిచే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ, వారసత్వ అంధత్వం, వినికిడి లోపాలు, జీవక్రియ వ్యాధులు, మెదడు అభివృద్ధి సమస్యలు.. ఇలా అనేక రూపాల్లో ఈ జన్యు ప్రమాదం బయటపడవచ్చు.

ఇది ఇండియాలో ఎంత ఎక్కువగా ఉందో 2024లో సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది. 2015 నుంచి 2021 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని 10,08,224 మంది వివాహిత మహిళల వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా రక్త సంబంధీకుల వివాహాల ప్రాబల్యం 13.6 శాతం. అందులో దగ్గరి సంబంధీకుల వివాహాలే 8.2 శాతం. దక్షిణ భారతంలో మొత్తం రక్త సంబంధీకుల వివాహాలు 26.3 శాతం ఉండగా.. దగ్గరి సంబంధీకుల వివాహాలు 19.7 శాతం. ఉత్తర భారతంలో ఈ సంఖ్యలు వరుసగా 6.4 శాతం, 3 శాతం మాత్రమే. అంటే దగ్గరి రక్త సంబంధీకుల వివాహాలు దక్షిణాదిలో ఉత్తరాదితో పోలిస్తే దాదాపు 6.6 రెట్లు ఎక్కువ.

ఇక్కడ దక్షిణ భారతం తనను తాను ప్రశ్నించుకోవాలి. తమిళనాడులో 30.1 శాతం, కర్ణాటకలో 28.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 27.6 శాతం, తెలంగాణలో 25.1 శాతం.. ఇవి 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా మరో పరిశోధనలో నమోదైన అంచనాలు. దేశంలో మొత్తం ప్రాబల్యం 10.8 శాతంగా ఉన్న సమయంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి నాలుగు వివాహాల్లో ఒకటి రక్త సంబంధీకుల మధ్య జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2026లో ప్రచురితమైన మరో జిల్లా స్థాయి అధ్యయనంలో 707 జిల్లాలను పరిశీలిస్తే 97 జిల్లాల్లో ఈ ప్రాబల్యం 20 శాతానికి మించి ఉంది. అత్యధిక ప్రాబల్యం ఉన్న మొదటి ఐదు జిల్లాలు కర్ణాటక, తమిళనాడులోనే ఉన్నాయి.

మరి విద్య, అభివృద్ధి, సామాజిక సంస్కరణల్లో ముందున్నామని చెప్పుకునే దక్షిణ భారతం ఈ విషయంలో ఎందుకు వెనుకబడింది? ఇతరుల మూఢనమ్మకాలను విమర్శించే ముందు వీరి ఇళ్లలోని అశాస్త్రీయ ఆచారాలను ప్రశ్నించే ధైర్యం ఎందుకు రావడం లేదు? వీళ్లకి నచ్చిన సంప్రదాయాల దగ్గరకు వచ్చేసరికి హేతువాదం ఎందుకు సెలవు తీసుకుంటోంది? ఇదే దక్షిణ భారత సమాజం చేసుకోవాల్సిన అసలైన ఆత్మవిమర్శ.

ఎందుకంటే ఒకప్పుడు తెలియని విషయాన్ని ఇప్పుడు సైన్స్ వివరిస్తోంది. అయినా దాన్ని ప్రశ్నించకుండా కొనసాగించడం సంప్రదాయాన్ని కాపాడటం కాదు.. అజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడం. కుటుంబ ఆస్తులు, వంశం, బంధుత్వం కాపాడుకోవడం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకునే సమాజం, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి మాత్రం ఎందుకు ఆలోచించదు? సంప్రదాయం మనిషి కోసం ఉండాలి. మనిషి జీవితం సంప్రదాయం కోసం బలికాకూడదు.