Cockroaches: ప్రకృతి రాసిన బొద్దింకల కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులకు కొన్ని జీవులంటే విపరీతమైన ప్రేమ..మరికొన్ని జీవులంటే కంపరం. రంగురంగుల సీతాకోకచిలుకలు కనిపిస్తే మనుషులు మురిసిపోతారు. పూల మీద వాలే తేనెటీగలను చూస్తే ప్రకృతిలో వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటారు. అయితే బొద్దింక కనిపిస్తే మాత్రం ముఖం చిట్లిస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చిందోనని ఆలోచిస్తారు. వెంటనే చంపేయడానికి ప్రయత్నిస్తారు. మనుషుల దృష్టిలో బొద్దింక అంటే అసహ్యం, అపరిశుభ్రత. కానీ ప్రకృతి దృష్టిలో ప్రతి జీవికీ ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి సురూపి, కురూపి అనే భేదం ఉండదు. మనుషులు చిన్నచూపు చూసే బొద్దింకలు ప్రకృతిలో ఎంత గొప్ప పని చేస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో రాత్రిపూట కాక్రోచ్లు చేస్తున్న ఒక చర్య నిజంగా అద్భుతం. ఇంతకీ అమెజాన్ అడవుల్లో బొద్దింకలు ఏం చేస్తున్నాయి? బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ బొటనీలో ప్రచురితమైన అధ్యయనం ఏం చెబుతోంది?
సాయంత్రం ఆరు గంటల సమయం.. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో సూర్యుడు నెమ్మదిగా మాయమవుతున్నాడు. చుట్టూ చీకటి పరుచుకోవడానికి సిద్ధమవుతోంది. అక్కడ ఒక చిన్న పొదలాంటి మొక్కకు పూసిన పూలు నెమ్మదిగా విచ్చుకోవడం మొదలుపెట్టాయి. పగలంతా మూడుచుకుని ఉన్న ఆ పూలు సాయంత్రం అవ్వగానే రేకులను విప్పుతున్నాయి. వాటి నుంచి వచ్చే సువాసన క్రమంగా పెరుగుతోంది. పూల కాడల నుంచి తేనె చుక్కలు కిందకు జారుతున్నాయి.
Also Read
- Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
ఆరు గంటల సమయానికి మొదలైన ఈ మార్పు, ఏడు గంటలు వచ్చేసరికి మరో ఆసక్తికరమైన దృశ్యానికి దారితీసింది. ఆ పూల దగ్గరకు బొద్దింకలు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కటిగా పూల మీదకు చేరుకుంటున్నాయి. వాటిలోని తేనెను తాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పూల దగ్గరకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వస్తాయని మనకు తెలుసు. కొన్ని మొక్కల దగ్గరకు గబ్బిలాలు కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం మాత్రం శాస్త్రవేత్తలకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ బొద్దింకలు కేవలం తేనె తాగి వెళ్లిపోవడం లేదు. ఆ మొక్కలో కొత్త కాయలు ఏర్పడటానికి కూడా సహాయపడుతున్నాయి. ఈ మొక్క పేరు మబేయా ఉలియానా. బ్రెజిల్‌లోని అమెజానాస్ ప్రాంతంలో మాత్రమే పెరిగే ప్రత్యేకమైన మొక్క ఇది.
అక్కడి తెల్లటి ఇసుక నేలల్లో, పోషకాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని పూల గుత్తులను దగ్గరగా పరిశీలిస్తే ఒక విచిత్రమైన నిర్మాణం కనిపిస్తుంది. పైన ఒకటి లేదా రెండు ఆడ పూలు ఉంటాయి. వాటి కింద 200లకు పైగా చిన్న చిన్న మగ పూలు ఉంటాయి. మగ పూల నుంచి పుప్పొడి విడుదలవుతుంది. ఆ పుప్పొడి ఆడ పూలకు చేరినప్పుడే వాటి నుంచి కాయలు ఏర్పడతాయి. ఇక్కడే బొద్దింకలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఒక బొద్దింక తేనె కోసం పూల దగ్గరకు వచ్చినప్పుడు నేరుగా తేనెను చేరుకోలేదు. ముందుగా పూల గుత్తి మీదుగా కిందికి వంగి వెళ్లాలి. అలా వెళ్లే సమయంలో దాని కాళ్లు, పొట్ట భాగం మగ పూలకు తగులుతాయి. ఆ పూల నుంచి విడుదలైన పుప్పొడి దాని శరీరానికి అంటుకుంటుంది. తేనెను తాగిన తర్వాత తిరిగి బయటకు వెళ్లేందుకు అదే దారిలో పైకి ఎక్కుతుంది. అప్పుడు దాని శరీరానికి అంటుకున్న పుప్పొడి ఆడ పూలకు తగులుతుంది. అంటే ఆ బొద్దింకకు కావాల్సింది కొద్దిగా తేనె మాత్రమే కానీ ఆ తేనె కోసం అది చేసే ప్రయాణం ఒక మొక్కలో కొత్త కాయలు ఏర్పడటానికి కారణమౌతుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఓ బొద్దింక అంతకుముందు మరో మొక్క దగ్గరకు వెళ్లి ఉంటే, అక్కడి పుప్పొడి కూడా దాని శరీరానికి అంటుకుని ఉండవచ్చు. అప్పుడు అది కొత్త మొక్క దగ్గరకు వచ్చినప్పుడు ఆ పుప్పొడిని కూడా అక్కడి ఆడ పూలకు చేరవేస్తుంది. ఇలా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పుప్పొడి చేరుతుంది. దీన్నే పరాగసంపర్కం అంటారు.
ఈ మొక్క పుప్పొడిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అది చాలా జిగటగా ఉంటుంది. అందుకే కీటకాల శరీరానికి సులభంగా అంటుకుంటుంది. అవి పూల మధ్య తిరిగిన ప్రతిసారీ పుప్పొడి కూడా వాటితో పాటు ప్రయాణిస్తుంది. ఇలా బొద్దింకలు ప్రకృతికి ఎంతో సాయం చేస్తున్నాయి. ఇక గతంలో ఫ్రెంచ్ గయానాలో జరిగిన మరో పరిశోధనలో కూడా బొద్దింకలు ఒక ఉష్ణమండల మొక్కకు పరాగసంపర్కం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మొక్కలో విత్తనాలుగా మారగల నిర్మాణాల్లో దాదాపు 41 శాతానికి బొద్దింకలే పరాగసంపర్కం చేస్తున్నాయని అంచనా వేశారు. నిజానికి ప్రతి జీవి తన వంతుగా ప్రకృతిలో ఏదో ఒక పని చేస్తోంది. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, ప్రకృతి తన సమతుల్యతను కాపాడుకోవడానికి కోట్లాది జీవుల సహకారం తీసుకుంటూనే ఉంటుంది.
ఇక్కడ చూస్తే మనిషి మాత్రం తన సంకుచిత ఆలోచనలతో జీవులకు విలువలు కడుతున్నాడు కానీ డార్విన్ పరిణామ సిద్ధాంతం చూపించిన జీవవృక్షంలో మనిషి కూడా ఒక కొమ్మ మాత్రమే. ప్రకృతిలో ప్రతి జీవికీ తనదైన పరిణామ చరిత్ర, మనుగడలో తనదైన పాత్ర ఉన్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక స్థానం ఉంది. తనకంటే గొప్ప జీవి లేదని విర్రవీగే మనిషికి ఈ సత్యం అర్థం కావడమే అసలైన పరిణామం.
తాజావార్తలు
-
Cockroaches: ప్రకృతి రాసిన బొద్దింకల కథ!
-
Ramayana Box Office Collection: ‘రామాయణ’ రికార్డుల వేట.. 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లు.. డే వైజ్ కలెక్షన్స్ ఇవే!
-
Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!