NTV Telugu Site icon

AP High Court: విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలంటూ ఏపీ హైకోర్టు సీరియస్.

Ap High Court

Ap High Court

AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్‌ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్‌ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది. చట్టాన్ని, ఆదేశాలను అమలుచేసినట్లు రుజువులు చూపించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్టీఈ రూల్స్‌ మేరకు పేద విద్యార్థులు ప్రైవేట్‌ స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

TS SSC Supplementary Result 2022: అలర్ట్.. నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

ఈ కేటగిరీలో ఎంత మందికి అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని, అవి సరిగా లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లు బాధ్యత వహించాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారుల చర్యలు పరోక్షంగా ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఉన్నాయంటూ ఆక్షేపించింది. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికింది. సమర్థతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సూచించింది. తాండవ యోగేష్‌ అనే అడ్వొకేట్‌ గతంలో దాఖలుచేసిన ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌పై ఇంతకు ముందే విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది.

ఈ వ్యాజ్యంపై చీఫ్‌ జస్టిస్‌ పీకే మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయిస్తున్నారనే సంగతి చాలా మంది పేరెంట్స్‌కి తెలియదని, అందువల్ల దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని న్యాయవాది చెప్పారు. ఏపీలో మొత్తం 16 వేల ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉన్నాయని, ఒక్కో స్కూల్లో కనీసం 5 సీట్లను ఆర్టీఈ కింద కేటాయించినా దాదాపు 80 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.

Show comments