IIT Bombay: దేశంలో ఐఐటీ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఐఐటీలో చదివిన విద్యార్థులకు దేశంలోనే కాదు ప్రపంచస్థాయిలో తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులను తమ ఉద్యోగంలో చేర్చుకోవాలని మల్టీ నేషనల్ కంపెనీలు ఉవ్విళ్లూరుతుంటాయి. తాజాగా మరోసారి ఐఐటీ సత్తా నిరూపితమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే(IIT Bambay) విద్యార్థులను జాక్‌పాట్ వరించింది. 85 మంది విద్యార్థులు రూ. కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. 2023-24 నియామకాల్లో సీజన్ ఫేజ్-1లో భాగంగా ఈ సాలరీ ప్యాకేజీని అందుకోనున్నారు.
ఐఐటీ బాంబే ఇటవల నిర్వహించిన క్యాంపస్ నియామక ప్రక్రియలో దేశవిదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 1188 మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలైన గూగుల్, యాపిల్, ఎయిర్‌బస్, యాక్సెంచర్, జేపీ మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని వర్చువల్‌గా నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి.
Read Also: World’s worst Rated Food: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఆహారం ఏంటో తెలుసా?
ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో జాబ్స్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ-సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్/ బ్యాంకింగ్/ఫిన్ టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటి విభాగాలు ఉన్నాయి. మనదేశంలో పాటు జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పనిచేసేందుకు 63 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీని చూస్తే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్లకు రూ. 21.88 లక్షలుగా ఉంటే, ఐటీ విద్యార్థులకు రూ. 26.30 లక్షలు, ఫైనాన్స్ లో రూ. 32.38 లక్షలు, కన్సల్టింగ్ రూ. 18.68 లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూ. 36.94 లక్షల చొప్పున వేతన ప్యాకేజీని అందుకోనున్నారు.