Wife Killed Her Husband After A Week Of Marriage: కడదాకా తోడుంటానంది, ప్రతి సమస్యలోనూ పాలుపంచుకుంటానంది, ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి విడువనంది, చివరికి పెళ్లి చేసుకున్న వారం రోజుల్లోనే భర్తను హతమార్చింది. తన ప్రియుడి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడింది. చివరికి బండారం బట్టబయలు కావడంతో.. అరెస్టై, జైలుపాలైంది. కాకినాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి 2019 మే 15వ తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. ఆమెకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు ఈ పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమెకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదంటే, తన గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి.. ఆమె కుటుంబ సభ్యులు సూర్యనారాయణతో పెళ్లి చేశారు.
తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేయడంతో.. నాగలక్ష్మి తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. అయితే.. ఆ కోపాన్ని తన భర్తపై చూపించింది. తన భర్త చనిపోతే.. తన వివాహేతర సంబంధానికి ఎవరూ అడ్డు రారని అనుకుంది. పెళ్లైన వారం రోజుల్లోనే.. తన ప్రియుడు రాధాకృష్ణతో కలిసి నాగలక్ష్మి ఒక పథకం వేసింది. పథకం ప్రకారం.. 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళ్దామంటూ.. పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న కత్తితో.. సూర్యనారాయణను నరికి హత్య చేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా అక్కడి నుంచి వచ్చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా.. నాగలక్ష్మి, రాధాకృష్ణ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డానికి తేల్చారు. అయితే.. ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు వారిద్దరు కలిసి ఎన్నో డ్రామాలు ఆడారు. చివరికి కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది.
దీంతో.. కోర్టు రాధాకృష్ణ, నాగలక్ష్మికి జీవిత ఖైదుతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అంతేకాదు.. సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు గాను ఆ ఇద్దరికి మరో మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షల్ని ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.