Wife Assassinated Her Husband Wife Help Of Lover: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. అనంతరం దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ.. వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఆ ఇద్దరి బండారాన్ని మూడున్నరేళ్ల చిన్నారి బయటపెట్టడంతో.. వాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. లకావత్ కొమ్రెల్లి అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం భారతి అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు జనగామలోని ఎస్టీ వసతి గృహంలో ఉండగా.. చిన్న కుమార్తె దంపతుల వద్దే ఉంది. ఈ దంపతులు నామాలగుండులో నివసిస్తున్నారు.
కట్ చేస్తే.. రెండేళ్ల క్రితం ఆ దంపతులు తమ బంధువుల పెళ్లికి వెళ్లారు. అక్కడ భారతికి డీజే ఆపరేటర్ బానోత్ ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వీళ్లు తమ బంధాన్ని రహస్యంగా కొనసాగిస్తున్నారు. అయితే.. ఇటీవల భార్య వివాహేతర బంధం గురించి భర్త కొమ్రెల్లి, భార్యని నిలదీశాడు. మరోసారి అతడ్ని కలవొద్దని హెచ్చరించాడు. దీంతో.. భర్తని అంతమొందించాలని భారతి నిర్ణయించుకుంది. మరోవైపు.. భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, ఆమె వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలని కొమ్రెల్లి అనుకున్నాడు. ఆ పథకంలో భాగంగానే.. ఈనెల 18న సొంతూరికి వెళ్తున్నానని కొమ్రెల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పుడు భారతి తన ప్రియుడ్ని ఇంటికి రప్పించింది.
అదే రోజు రాత్రి ఇంటికి తిరిగొచ్చిన కొమ్రెల్లి.. తన భార్య, ప్రియుడు కలిసి ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేక గొడవకు దిగాడు. అప్పుడు ప్రియుడు, భారతి కలిసి.. చున్నీతో ఉరేసి, కొమ్రెల్లిని చంపేశారు. ఈ హత్యని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. కొమ్రెల్లి శవాన్ని బైక్ మీద వేసుకొని, దగ్గరలో ఉన్న వంతనకు వెళ్లారు. అక్కడ శవాన్ని పై నుంచి తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఇది హత్యేనని తేల్చడంతో.. పోలీసులు తమదైన రీతిలో విచారణ చేపట్టారు. భారతిపై అనుమానం రావడంతో, ఆమె మూడున్నరేళ్ల కూతురిని విచారించారు. అప్పుడే ఆ చిన్నారి తల్లి బండారం బయటపెట్టింది. తన తల్లే మరో వ్యక్తితో కలిసి తండ్రిని చంపిందని ఆ పాప తెలిపింది.దీంతో.. ప్రవీణ్, భారతిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.