Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!

Instagram Fraud

Instagram Fraud

Vizag Crime: రోజురోజుకీ మోసాలు కూడా సరికొత్తవి వెలుగు చూస్తున్నాయి.. సైబర్‌ మోసాలు సతమతం చేస్తుంటో.. మరోవైపు సోషల్‌ మీడియా క్రైమ్‌ కూడా పెరిగిపోతుంది.. సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి ఘరానా చోరీ వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న ఓ మహిళ.. అనారోగ్యంతో ఉన్నానంటూ బాధితురాలి ఇంటికి వచ్చి రోజుల తరబడి అక్కడే ఉంటూ చివరకు బంగారు, వజ్రాల ఆభరణాలను చోరీ చేసిన ఘటన బయటకు వచ్చింది..

విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళ అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉంటూ అందరితో కలిసిపోయింది. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా బీరువాలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇక, ఈ ఘటనపై బాధితురాలు మానేపల్లి నీరజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో భద్రపరిచిన 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాల ఆభరణాలు, బంగారు మెడల్ ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంటికి వచ్చి నమ్మించి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని.. ఎలాంటి పరిచయాలు లేకుండా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు..