Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్‌లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్‌గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
మనీషా తన చేతులు, కాళ్లు, కడుపుపై పెన్నుతో సూసైడ్ నోట్ రాసింది. నా మరణానికి కుందన్, అతడి కుటుంబ సభ్యులే కారణమని పేర్కొంది. మనీషా తన అత్తమామ, భర్తను నిందిస్తూ ఓ వీడియో కూడా చేసింది. దీనిని పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో మనీషా ఏడుస్తూ.. తన భర్త, తండ్రి, అతడి సోదరుడు కట్నం కోసం తనను ఎలా వేధించారనే విషయాలను వెల్లడించింది.
Read Also: Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
ఆమె కుటుంబం చెప్పిన దాని ప్రకారం, మనీషా వివాహానికి రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. కట్నం కింద బుల్లెట్ బైక్ ఇచ్చారు. అయితే, ఎప్పటికప్పుడు వారు పదే పదే కారు, భారీ మొత్తంలో నగదును డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. తన అత్తమామలు ఎప్పుడూ కొట్టేవారని, గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేసినట్లు మనీషా ఆరోపించింది. కట్నం కోసం వేధిస్తూ, విద్యుత్ షాక్‌తో చంపాలని ప్రయత్నించినట్లు చెప్పింది.
మనీషా 2023లో నోయిడాకు చెందిన కుందన్ అనే వ్యక్తితో వివాహం అయినట్లు అధికారులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని రోజుల ముందు నుంచే అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. హింస పెరగడంతో, మనీషా జూలై 2024లో తన సొంతింటికి వెళ్లింది. ఆమె మరణానికి నాలుగు రోజుల ముందు, మనీషా కుటుంబం విడాకులు తీసుకోవడం గురించి చర్చించారు. ఆమె అత్తమామలు తాను ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేంత వరకు విడాకుల పత్రాలపై సంతకం చేయనని చెప్పినట్లు అధికారులు తెలిపారు.
