ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ సంఘటన బరద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండుల్దిహ్ గ్రామంలో జరిగింది. ఇంటి నుంచి పెద్దగా శబ్ధాలు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) రమా పటేల్ తెలిపారు. ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Viral News: రూ.2.5 లక్షలు దోచుకున్న పనిమనిషి..! పట్టించిన వాట్సాప్ స్టేటస్..
పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోగా.. వికాష్ గోండ్ (25), విక్కీ గోండ్ (22) అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి ఇతర కుటుంబ సభ్యులు వారి చుట్టూ కూర్చుని కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఈ మృతదేహాల ముందు ఓ దేవుడి ఫొటోను ఉంచారు. పోలీసులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు సోదరులను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు చనిపోయినట్లు నిర్ధారించారు. వారి తల్లి పిరిత్ బాయి (70), సోదరీమణులు చంద్రిక, అమరిక, మరో సోదరుడు విశాల్ మతిస్థిమిత లేనట్లుగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. మృతుల మృతదేహాలలో కొన్ని విషపూరిత పదార్థాల జాడలు కనిపించాయని ఒక అధికారి తెలిపారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..