Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
నఖత్ సింగ్ భాటి(50) మంగళవారం సైకిల్‌పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన గోపాల్‌ని పోలీసులు పట్టుకున్నారు. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, గోపాల్ ఉద్దేశపూర్వకంగానే నఖత్ సింగ్‌ని ఢీకొట్టి, ట్రక్కు అతడిపైకి ఎక్కించినట్లు తేలింది.
Read Also: KVP Ramachandra Rao: నా ఫాంహౌస్ అక్రమమైతే నేనే కూలుస్తా..
విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పగ-ప్రతీకారం గురించి గోపాల్ పోలీసులకు చెప్పాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని తేలింది. 2002లో రాజస్థాన్ జైసల్మీర్‌లో గోపాల్ తండ్రి హరిసింగ్ భాటిని ట్రక్కుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ కేసులో నఖత్ సింగ్‌తో పాటు అతడి నలుగురు సోదరుల ప్రమేయం ఉంది. వీరికి ఏడేళ్ల శిక్ష విధించబడింది. అప్పటి నుంచి తండ్రిని హత్య చేసిన నఖత్ సింగ్‌పై గోపాల్ పగ పెంచుకున్నారు. ఎలాగైనా చంపాలని భావించాడు.
ఈ హత్య కోసమే గోపాల్ గత వారం రూ.8 లక్షలతో పికప్ ట్రక్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు కోసం రూ. 1.25 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాడు. నఖత్‌ని చంపేందుకు అతడి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడు. పోలీసులు గోపాల్ మొబైల్ వివరాలు పరిశీలించడంతో ఈ విషయం తేలింది. నఖత్, గోపాల్ కుటుంబాల మధ్య కొంతకాలంగా శత్రుల్వ ఉందని పోలీసులు వెల్లడించారు.