పోలీసులు ఎంతగా ప్రయత్నించినా నేరాలు అదుపులోకి రావడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగిన రోజే…..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. నూతనంగా తిరుపతి పట్టణంలో కలెక్టర్,ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన రోజే మందు బాబులు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తూ వుండగానే తెగబడ్డారు. సాక్షాత్తు భద్రతను పర్యవేక్షించవలసిన పోలిసులు ప్రేక్షక పాత్ర పోషించారు.
మద్యం మత్తులో ముగ్గురు కలసి ఒక యువకుడిని చితకబాదారు. అందరు అయ్యో పాపం వదిలెయ్యండి అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు. యువకుడికి రక్తం వచ్చేలా చితకబాదారు. ఆటో డ్రైవర్ ని అడ్రస్ అడిగినందుకే యువకుడిని చితకొట్టుడు కొట్టారని సమాచారం. మొత్తానికి ఖాకీల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శాంతి భధ్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని నూతన ఎస్పీ ప్రకటించిన రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.