Site icon NTV Telugu

QNET Investment Scam: మరో యువకుడిని బలి తీసుకున్న QNET.. ఏంటి స్కామ్..?

Qnet

Qnet

QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వెల్లూరుకి చెందిన హరికృష్ణ అనే వ్యక్తిని తక్కువ పెట్టుబడులపై అత్యున్నత రాబడి ఇస్తానని హామీ ఇచ్చి క్యూనెట్ నెట్‌వర్క్‌లోకి ఆకర్షించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ తెలిపారు. హరికృష్ణ తండ్రి బడుగు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

READ MORE: Hyderabad Tragedy: వాళ్లేం తప్పు చేశారు..? కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లిదండ్రులు..!

వెల్లూరుకు చెందిన కల్వల మణికంఠరెడ్డి, మెదక్ జిల్లా చెట్ల గౌరారం గ్రామానికి చెందిన ఉప్పలపు అలేఖ్య అనే ఇద్దరు స్థానికులు.. హరికృష్ణకు QNET స్కీమ్‌ను పరిచయం చేశారు. QNETలో డబ్బు పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నిందితులు అతనిని ఒప్పించారు. జులై 2025లో, సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో నిందితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హరికృష్ణ హాజరయ్యారు. అక్కడ ఆయన సభ్యత్వం కోసం 4 లక్షల రూపాయలు చెల్లించారు. ఆ తర్వాత దఫదఫాలుగా మరో 4 లక్షలు చెల్లించారు. మొత్తంగా హరికృష్ణ.. రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఐతే తన పెట్టుబడికి ప్రతిగా.. హరికృష్ణ పదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే ‘ట్రిప్ సేవర్’ కూపన్, ‘బిజినెస్‌ ప్రమోషన్’ అని పిలిచే దానిలో భాగంగా ఒక వాచ్ అందుకున్నాడు. తరువాత.. అతను నిందితులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన అనేక సెమినార్లకు హాజరయ్యారు. మొత్తంగా ఆ స్కీమ్‌ ప్రొడక్ట్‌ ఆధారిత వ్యాపారంలా సాగుతోందని తెలుసుకున్నారు.

READ MORE: Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం

ముఖ్యంగా నిజమైన అమ్మకాలు రాబడి ఉండదని తెలుసుకున్న తర్వాత తీవ్రంగా మనస్థాపం చెందారు. పైగా తన పెట్టుబడులకు ఎలాంటి రిటర్న్స్ రాకపోవడంతో చివరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 2025 అక్టోబర్ 9న తన నివాసంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.. ఇక ఈ కేసులో పోలీసులు మణికంఠ రెడ్డి, అలేఖ్య ఇద్దరినీ అరెస్టు చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. “QNET.. లాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version