MLM : సిద్దిపేట జిల్లాలో మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ కంపెనీ క్యూనెట్ మోసానికి ఒక యువకుడు బలయ్యాడు. వర్గల్ మండలం వేలూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ (26) అనే యువకుడు ఇటీవల ఒక స్నేహితుడి సూచన మేరకు క్యూనెట్ కంపెనీలో చేరాడు. కంపెనీ ప్రతినిధులు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల 15 వేల రూపాయలు రెగ్యులర్‌గా వస్తాయని హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మొత్తం 4 లక్షలు చెల్లించాడు.
అయితే ఆ తర్వాత కంపెనీ మాట మార్చింది. తాను తీసుకున్న లింక్ కింద మరో వ్యక్తిని చేర్చి, అతను కూడా 4 లక్షలు చెల్లిస్తేనే డబ్బులు వస్తాయని హరికృష్ణకు తెలియజేశారు. ఈ షరతుతో యువకుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. తాను మోసపోయాననే భావనతో తీవ్ర మనోవేదనకు లోనైన హరికృష్ణ చివరికి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హరికృష్ణ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో.. “క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది. వాళ్లు చెప్పింది ఒకటి, చేసేది ఇంకోటి. నేను పూర్తిగా మోసపోయాను…” అని పేర్కొన్నాడు. స్థానిక సమాచారం ప్రకారం.. హరికృష్ణ గతంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు 18 లక్షలు నష్టపోయాడని తెలిసింది. ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలనే ఆశతో ఈ చైన్ ఫైనాన్స్ స్కీంలో చేరిన అతను చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై వర్గల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Rare-earth minerals: అమెరికాకు ఇవ్వమని హామీ ఇవ్వండి.. ‘‘రేర్-ఎర్త్’’పై భారత్‌ను కోరిన చైనా..