Site icon NTV Telugu

ESI Hospital : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

ESI Hospital : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో వారు మృతి చెందారు. ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడి సిబ్బంది, ఇతర కార్మికులు అరుపులు వినిపించడంతో పరుగెత్తుకొని వచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రింగ్, స్లాబ్ పనుల్లో అలాంటి పొరపాట్లు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవనం బలహీనత లేదా పనులను సక్రమ పర్యవేక్షణ లేకుండా నిర్వహించడం కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకెళ్లగా, ఆస్పత్రి క్యాంపస్‌లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘోర ఘటనతో కార్మికుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన

Exit mobile version