NTV Telugu Site icon

Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..

Up

Up

Lucknow: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర నాథ్ దూబే భార్య మోహిని దూబేను దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. శనివారం లక్నోలోని తన ఇంట్లోనే మోహిని దూబే శవంగా కనిపించింది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో దేవేంద్ర నాథ్ దూబే గోల్ఫ్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

దూబే ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, ఇంటి ద్వారాలు తెరిచి ఉంచడం గమనించారు, లోపలి వెళ్లి చూడగా ఆయన భార్య మోహిని మెడకు ఉచ్చు బిగించి, చనిపోయి ఉండటాన్ని గమనించారు. లోపల అల్మారా తెరిచి ఉండటంతో పాటు నేలపై అనేక వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలోని సెక్టార్ 22లోని ఓ పోష్ లొకాలిటీలో ఈ ఘటన జరిగింది.

Read Also: Swati Maliwal : స్వాతి మలివాల్‌కి రేప్, హత్య బెదిరింపులు.. యూట్యూబర్ ధృవ్ రాథీపై ఆరోపణలు..

‘‘ఉదయం 9.45 గంటలకు DN దూబే గోల్ఫ్ ఆడి తిరిగి వచ్చినప్పుడు, అతను తన భార్య చనిపోయి ఉండటాన్ని కనుగొన్నాడు. పాలవాడు 7.15 గంటలకు పాలను అందించాడు, ప్యాకెట్‌లోని పాలు వేడి చేయకుండా అలాగే ఉన్నాయి.’’ అని లక్నో జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) ఆకాష్ కుల్హారీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపామని, డాగ్ స్వ్కాడ్‌తో పాటు మా క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన ఫోరెన్సిక్ టీమ్స్ నేరస్థలానికి చేరుకున్నాయని, విచారణ కొనసాగుతోందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణాన్ని నిర్ధారించగమని ఆయన తెలిపారు. దుండగులు తమను కనిపెట్టేస్తారనే కారణంతో సీసీటీవ-డీవీఆర్ సిస్టమ్‌ని తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అయితే, వారిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని అన్ని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.