Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!

  • సోషల్ మీడియాలో జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో మోసాలు
  • మొదట చిన్న ఫీజు.. తర్వాత లక్షల్లో డబ్బుల డిమాండ్
  • ఫోటోలు, వ్యక్తిగత వివరాలతో బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడుతున్న కేటుగాళ్లు
  • 1930కు వెంటనే కాల్ చేయండి.. సైబరాబాద్ డీసీపీ హెచ్చరిక
Astro Scam

Astro Scam

Astro Scam : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp), ఫేస్‌బుక్ (Facebook) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములను వేదికగా చేసుకుని “ఆన్‌లైన్ జ్యోతిష్యం, తంత్ర పూజల” పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) టి. సాయి మనోహర్ తెలిపారు.

వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. “మీ వ్యక్తిగత సమస్యలకు తక్షణ పరిష్కారం”, “ధన ప్రాప్తి కోసం ప్రత్యేక శాంతి పూజలు”, “ఆర్థిక సమస్యల నివారణ”, “ప్రేమ వివాహం”, “వశీకరణ”, “బిజినెస్ గ్రోత్”, “కుటుంబ కలహాల పరిష్కారం” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు (Ads) ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

మొదట చిన్న మొత్తం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు
ఈ తరహా మోసాల్లో సైబర్ నేరగాళ్లు ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తారని డీసీపీ పేర్కొన్నారు. మొదట కేవలం చిన్న మొత్తంలోనే ఫీజు తీసుకుని సేవలు అందిస్తామని నమ్మబలుకుతారు. ఆ తర్వాత సమస్య తీవ్రతను చూపిస్తూ రకరకాల దోషాలు ఉన్నాయని, వాటి నివారణకు పెద్ద ఎత్తున పూజలు చేయాలంటూ విడతల వారీగా వేలల్లో, లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. బాధితులు ఒక దశలో మోసాన్ని గ్రహించి డబ్బులు పంపడం ఆపేసినా లేదా వారిని బ్లాక్ చేసినా.. అసలు కథ మొదలవుతుంది.

నేరగాళ్లు వేరే నంబర్ల నుండి వాట్సాప్ కాల్స్, మెసేజీల ద్వారా బాధితులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని, చేతబడి చేస్తామని బెదిరించడమే కాకుండా.. బాధితులు గతంలో పంచుకున్న వ్యక్తిగత ఫోటోలు, వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ఈ మోసాల కోసం వీరు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, ఫేక్ ఫోటోలు, ఫేక్ రివ్యూలు , ఇతరుల పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలను (Mule Accounts) వాడుతుంటారు. కొన్నిసార్లు ఒకే గ్యాంగ్ విభిన్న పేర్లతో పదుల సంఖ్యలో అకౌంట్లు నడుపుతూ బాధితులపై తీవ్ర మానసిక ఒత్తిడిని తీసుకువస్తుందని పోలీసులు గుర్తించారు.

సైబర్ పోలీసులు ఇస్తున్న ముఖ్యమైన సూచనలు:

  • ఆన్‌లైన్ బాబాలు, నకిలీ జ్యోతిష్యుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు క్రింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు..
  • సోషల్ మీడియాలో కనిపించే ఆన్‌లైన్ జ్యోతిష్యం, తంత్ర, వశీకరణ , తక్షణ సమస్యల పరిష్కారం వంటి నకిలీ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు.
  • ఇంటర్నెట్‌లో పరిచయమైన తెలియని వ్యక్తులకు, నకిలీ అకౌంట్లకు డబ్బులు పంపించే ముందు పూర్తి స్థాయిలో వారి వివరాలను ధృవీకరించుకోవాలి.
  • మీ వ్యక్తిగత ఫోటోలు, సున్నితమైన సమాచారం లేదా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను అపరిచితులతో అస్సలు పంచుకోవద్దు.
  • మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు (OTP) లేదా యూపీఐ పిన్ (UPI PIN) నంబర్లను ఎవరికీ చెప్పకూడదు.
  • ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆన్‌లైన్ వేదికగా బెదిరింపులకు గురిచేస్తే భయపడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.

ఈ తరహా ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.cybercrime.gov.in లో తమ ఫిర్యాదును నమోదు చేయాలని డీసీపీ టి. సాయి మనోహర్ స్పష్టం చేశారు. తక్షణ పరిష్కారాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన పోస్టుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.