Cheating Gang: డబ్బు.. బంగారం అంటే ఆశ పడని వారు ఎవరు ఉంటారు? అలాంటి అత్యాశాపరులనే వారు టార్గెట్ చేస్తారు. పెద్ద మొత్తంలో సొమ్ములు వస్తాయని నమ్మిస్తారు. ఒక్కసారి వారి వలలో పడి నమ్మేశారో అంతే..!! అలాంటి అమాయక చక్రవర్తులను బుట్టలో వేసేసి.. ఉన్నదంతా ఊడ్చేస్తారు. అలా పూజల పేరుతో బురిడీ కొట్టిస్తున్న నాగ్‌పూర్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజ ఇంట్రడక్షన్ సీన్ గుర్తుందా? లక్షలకు డబ్బులు వస్తాయని నమ్మించి కాలనీలో ఉన్న మహిళలు అందరికీ అర గుండ్లు గీకేసి పారిపోతాడు. ఆ తర్వాత బ్రహ్మనందం వచ్చి పూర్తి గుండు చేసి అందినకాడికి ఎక్కువ డబ్బులు దోచేస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. లక్షల రూపాయలు డబ్బు, లంకె బిందెలు దొరుకుతాయంటే ఆశ పడని వారు ఉండరు. అందుకే నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ గ్యాంగ్ ఇలా ఆశ పెట్టి జనాల దగ్గర లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు.
మాయ మాటలు చెప్పడం.. జనాలను బురిడీ కొట్టించడం దొరికిన సొమ్ముతో చెక్కేయడం నాగ్‌పూర్ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఐతే ఈ మోసం ఓ బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నాగ్‌పూర్ గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?
ఐతే నాగ్‌పూర్ గ్యాంగ్ బాగోతం .. బంజారాహిల్స్‌లో వెలుగులోకి వచ్చింది. హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ.. హైదరాబాద్‌లో రెక్కలు కట్టుకుని తిరిగారు నాగ్‌పూర్ గ్యాంగ్. నిజాంపేట్‌తోపాటు, నాగోల్‌లోని ఆయుర్వేద సెంటర్లను అడ్డాగా చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన అమాయకులకు వల విసిరారు. ఆ వలలో.. బంజారాహిల్స్‌కు చెందిన గోపాల్ సింగ్ అనే అమాయక చక్రవర్తి పడిపోయాడు. అప్పటికే చాలా డబ్బు ఉంది. కానీ అత్యాశతో నాగ్ పూర్ గ్యాంగ్ విసిరిన వలలో చిక్కుకున్నాడు. అప్పనంగా రెండు కిలోల బంగారం వస్తుందని ఊహల్లో తేలియాడుతూ ఊహించుకున్నాడు.
అన్నీ సెట్ చేసుకుని నాగ్‌పూర్ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నాడు గోపాల్ సింగ్. దీంతో నాగ్ పూర్ గ్యాంగ్ సభ్యులు.. గోపాల్ సింగ్ ఇంట్లోకి స్వామీజీల వేషధారణలో ఎంట్రీ ఇచ్చారు. తమ వద్ద హిమాలయాల్లో దొరికే మూలికలు, భస్మం ఉందని చూపించారు. వాటితో తయారు చేసిన బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇక జీవితంలో కష్టాలు ఉండవని నమ్మించారు. సరిగ్గా పూజలు మొదలు పెట్టే ముందు ట్విస్ట్ ఇచ్చారు. పూజ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఐతే 2 కేజీల బంగారం ముందు జస్ట్ రూ. 10 లక్షలు ఎంత అనుకున్నాడు అమాయక చక్రవర్తి గోపాల్ సింగ్. ఇంకేముంది వారు అడిగినట్లుగానే రూ. 10 లక్షలు చెల్లించి పూజకు ప్రోసీడ్ అన్నాడు.
Bhatti Vikramarka : దేశ స్థాయిలో తెలంగాణ గౌరవం నిలబెట్టాలి
అంతా బాగానే ఉంది. పూజలు సజావుగా సాగుతున్నాయి… ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు నెల రోజులపాటు పూజల పేరుతో కలర్ ఇచ్చారు నాగ్ పూర్ గ్యాంగ్. సీన్ కట్ చేస్తే.. ఒక ఎర్ర రంగు బట్టలో 2 కేజీల బంగారం ఉందని వారికి ఓ సంచీ ఇచ్చారు. దాన్ని మరో వారం రోజులపాటు పూజ చేసి తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు.. సరిగ్గా వారం రోజులపాటు గోపాల్ సింగ్ కుటుంబం నిష్టగా పూజలు చేసింది. అనుకున్న సమయం రానే వచ్చింది. ఇక ఎర్ర రంగు మూటను విప్పి చూసి అంతా షాక్ అయ్యారు. బంగారం ఉంటుంది అనుకున్న చోట బంగారం రంగుతో ఉన్న ఇనుప కడ్డీలు దర్శనమిచ్చాయి. ఇక స్వామీజీలు ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేశాడు గోపాల్ సింగ్. కానీ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు నాగ్ పూర్ గ్యాంగ్ లోని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారంతా పలు ఆయుర్వేదిక్ సెంటర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తిరుగుతున్నట్లు గుర్తించారు. హిమాలయాల్లోని భస్మం పేరు చెప్పి వారానికి రూ. 80 లక్షలు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. తేరగా డబ్బు వస్తుందని.. బంగారం దొరుకుతుందని..లంకె బిందెలు లభిస్తాయని గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అలా చెబితే.. తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాజంలో అమాయకులకు వల వేస్తున్న ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.