NTV Telugu Site icon

Digital Arrest: 26 ఏళ్ల యువతి “డిజిటల్ అరెస్ట్”.. వీడియో కాల్‌లో బట్టలు విప్పాల్సి వచ్చింది..

Digital Arrest Scam

Digital Arrest Scam

Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా ముంబైలో 26 ఏళ్ల మహిళ ఇలా ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. వీడియో కాల్ సమయంలో బట్టలు బలవంతంగా విప్పేలా చేశారు. పోలీసుల అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో రూ.1.78 లక్షలు మోసం చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 19-20 మధ్య జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అయిన మహిళకు ఢిల్లీ పోలీసులమని చెప్పుకునే వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. వ్యాపారవేత్త నరేష్ గోయల్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో యువతికి ప్రమేయం ఉందని బెదిరించారు.

Read Also: Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?

స్కామర్లు అనేక నంబర్లు ఉపయోగించి, ఆమెని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వర్చువల్ ఇంటరాగేషన్ కోసం ఒక గదిని బుక్ చేయమని బలవంతం చేశారు.వీడియో కాల్ సమయంలో నిందితులు బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ కోసం రూ. 1.78 లక్షలు బదిలీ చేయమని మహిళని మోసగించారు. ఆ తర్వాత ‘‘బాడీ వెరిఫికేషన్’’ కోసం డిమాండ్ చేస్తూ, ఆమెని బట్టలు విప్పమని బలవంతం చేశారు.

బాధితురాలు నవంబర్ 28న సంఘటనపై ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు మరియు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దోపిడీ మరియు వేధింపుల కేసు నమోదు చేయబడింది. మొదట దహిసర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును అంధేరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం అనుమానితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.