NTV Telugu Site icon

West Bengal: బెంగాల్‌‌లో మరో దారుణం.. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..

West Bengal

West Bengal

West Bengal: కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, ఆర్‌ జీ కర్ సంఘటన మరవక ముందే బెంగాల్‌లో మరో ఘోరం జరిగింది. హుగ్లీలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కారులో ఎక్కించుకుని అత్యాచారం చేసిన నిందితులు, ఆమెను అపస్మారకస్థితిలో రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మైనర్ బాలిక హుగ్లీ జిల్లాలోని హరిపాల్ వద్ద చిరిగిన బట్టలతో అపస్మారస్థితిలో కనిపించింది. బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?

బాలికను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు. దీనిపై బెంగాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘‘మెడికో లీగల్ ఒపీనియన్‌తో సహా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అనుమానితులను గుర్తించలేదు’’అని బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. బాలిక, ఆమె కుటుంబ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే, ఈ ఘటనపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆస్పత్రిని సీజ్ చేసి, మీడియాకు ప్రవేశాన్ని నిరాకరించారని, ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘మమతా బెనర్జీ పోలీసులు ఆసుపత్రిని చుట్టుముట్టారు, మీడియాకు ప్రవేశం లేదు మరియు స్థానిక టిఎంసి నాయకులు ఈ సంఘటన గురించి నివేదించబడకుండా చూసేందుకు చుట్టూ తిరుగుతున్నారు’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలకు అత్యంత ‘‘అసురక్షిత ప్రాంతం’’గా ఉందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.