Kerala: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ బఘేల్ కేరళలో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశీగా పొరబడిని కొందరు వ్యక్తులు అతడిని చావ చితకబాదారు. తీవ్రమైన గాయాలతో అతను మరణించాడు. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో జరిగింది.
Read Also: Samantha: చీరలు అమ్మాయిలకి మంచి ఫ్రెండ్స్.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం, వలయార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టపల్లం ప్రాంతంలో, స్థానిక నివాసితులు దొంగతనం చేశాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని గుర్తింపు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత క్రూరంగా దాడి చేశారు. అయితే, అతడి వద్ద ఎలాంటి దొంగిలించిన వస్తువులు లభించలేదని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో రామ్‌నారాయణ్ శరీరంపై 80కి పైగా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తలపై బలమైన గాయాలు ఉన్నాయి. అతి ఛాతి నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించిందని పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాడి సమయంలో రామనారాయణ్‌ను పదే పదే బంగ్లాదేశీ అని పిలవడం వినవచ్చు.
ఈ కేసులో అట్టపల్లం గ్రామానికి చెందిన మురళి, ప్రసాద్, అను, బిపిన్, ఆనందన్ అనే ఐదుగురు నిందితులను డిసెంబర్ 18న అరెస్ట్ చేశారు. విచారణలో రామనారాయణకు ఎలాంటి నేర చరిత్ర లేదని తేలిసింది. మృతుడికి ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు.
