Uttar Pradesh: ‘‘నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు’’ అని ఒక వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూర్యోదయ కాలనీకి చెందిన బాధితుడు ఒక డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2025 జూన్ 22న అతను మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే, కొద్దికాలానికే వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయి.
తన భార్య తరుచూ ఒక యువకుడితో ఫోన్‌లో మాట్లాడేదని, దీనిపై ప్రశ్నిస్తే గొడవ చేసేదని ఆరోపించాడు. ఆ తర్వాత తన భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందని, ఇప్పుడు తన ప్రియుడితో కలిసి తనను చంపేస్తానని బెదిరిస్తోందని అతను చెబుతున్నాడు. తన భార్య విషం ఇచ్చిన కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం చేసిందని, తనపై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేయించిందని ఆరోపించారు. జూలై 14న భార్య, ఆమె ప్రియుడు తనపై దాడికి పాల్పడినట్లు వ్యక్తి ఆరోపించాడు.
జూన్ 17న తన భార్య ఓ గుర్తు తెలియని వ్యక్తితో బైక్‌పై వెళ్తుండగా వీడియో తీశానని, అనంతరం వారికి ప్రమాదం జరగడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. తనపై వరకట్న వేధింపుల కేసు నమోదై ఉండటంతో, తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు. ఇటీవల భర్తల హత్య ఘటనల్ని ప్రస్తావిస్తూ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని వెంటనే రక్షణ కల్పించాలని కోరాడు. ఈ ఘటనపై మీరట్ సివిల్ లైన్స్ సీఓ విశ్వ జ్యోతి రాయ్ స్పందిస్తూ, బాధితుడి ఫిర్యాదును మెడికల్ పోలీస్ స్టేషన్‌కు పంపించినట్లు తెలిపారు. ఇరు పక్షాలను విచారించి, దర్యాప్తులో తేలిన వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

