Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చెల్లికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడని తెలిసి ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె తరుపు బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలోని బారాబంకిలో జరిగింది. సోదరి పెళ్లికి LED టీవీని, బంగారు ఉంగరాన్ని బహూకరించాలని అనుకుంటున్నాడని అతనిపై భార్య కోపం పెంచుకుంది. ఈ విషయం భార్య,భర్తల మధ్య గొడవకు దారి తీసింది. గొడవ పెద్దది కావడంతో బాధిత వ్యక్తి కొట్టి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Read Also: AMB Cinemas: బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న మహేష్ బాబు
ఈ కేసులో బాధితుడి భార్య, సోదరుడు సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చంద్ర ప్రకాష్ మిశ్రా, క్షమా మిశ్రా భార్యభర్తలు. సోదరి పెళ్లికి కానుక విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో భార్య క్షమామిశ్రా తన సోదరుడు ఇతర బంధువులను కదరాబాద్‌లోని తన నివాసానికి మంగళవారం పిలిచింది. ఈ సమయంలోనే వారంతా కలిసి చంద్ర ప్రకాష్‌ని తీవ్రంగా కొట్టారు.
పోలీస్ సర్కిల్ ఆఫీసర్ (CO) ఫతేపూర్ డాక్టర్ బిను సింగ్ మాట్లాడుతూ.. చంద్ర ఏప్రిల్ 26న జరగబోయే తన సోదరి పూజా పెళ్లికి ఎల్ఈడీ టీవీ, బంగారు ఉంగరాన్ని కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, ఇది భార్య క్షమాకు నచ్చలేదు. ఈ విషయంలో బంధువుల జోక్యాన్ని చంద్ర ప్రశ్నిచంగా.. వారు అతడిపై కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చంద్రను ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులందరిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చంద్రప్రకాష్‌కి గోపాల్ అనే ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.