హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర సంబంధానికి దారి తీసింది. దీంతో ఇద్దరు నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఇలా ఉన్న క్రమంలో ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వెంకటలక్ష్మి, అతనిని వదిలి కొడుకు ఇంటికి వచ్చి ఉంటుంది.
బుధవారం రాత్రి వెంకటేష్, వెంకట లక్ష్మిని ఇంటికి రమ్మని పిలిచాడు. ఆమె రాను అని తెగేసి చెప్పడంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో కోపోద్రిక్తుడైన వెంకటేష్ తనతో పాటు తెచ్చిన కిరోసిన్ ని ఆమెపై పోసి నిప్పటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తట్టుకోలేని వెంకటలక్ష్మి అక్కడిక్కడే సజీవదహనం అయ్యింది. ఈ ఘటనలో వెంకటేష్ కి కూడా మంటలు అంటుకోవడంతో అతను కూడా గాయాలయ్యాయి. మంటలను చూసిన స్థానికులు వెంటనే వాటిని ఆర్పీ వెంకటేష్ ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
