ఈమధ్య కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారినే కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు చికెన్ కూర వండలేదని, తన భార్యని అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కెంచప్ప, షీలా అనే జంట 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బన్నికోడు గ్రామంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది.
అయితే, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వేరెవరితోనో ఎఫైర్ పెట్టుకుందని కెంచప్పకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి గతంలోనే వివాహమైందన్న విషయం తెలియడంతో.. వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తాళలేక షీలా తన పుట్టింటికి వెళ్లిపోయింది. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు పలుసార్లు పంచాయతీ కూడా నిర్వహించారు. కానీ, షీలా మాత్రం భర్త వద్దకు వెళ్లనని మొండికేసింది. తనకు భర్త వేధింపుల్ని తాను భరించలేనని, పుట్టింట్లోనే ఉంటానంటూ అక్కడే ఉండిపోయింది.
కట్ చేస్తే.. కూతురు పుట్టినరోజు రావడంతో పుట్టింట్లో ఉంటోన్న షీలా బుధవారం రాత్రి భర్త ఇంటికి వెళ్లింది. అప్పటికే పీకల్లోతు తాగేసి ఉన్న కెంచప్ప.. తనకు చిల్లి చికెన్ వండి పెట్టాలని కోరాడు. కానీ, షీలా వండలేదు. దీంతో వీరి మధ్య మళ్లి గొడవ మొదలైంది. తీవ్ర కోపాద్రిక్తుడైన కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా చంపేశాడు. మత్తు దిగిన తర్వాత, తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో, అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.