Doctor Suicide: మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఎస్ఐ బడ్నేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
“పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బడ్నే నా మరణానికి కారణం. అతను నన్ను నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. అతను ఐదు నెలలకు పైగా నన్ను అత్యాచారం, మానసికంగా మరియు శారీరకంగా హింసించాడు” అని నోట్‌లో పేర్కొంది. ఫల్తాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలు, జూన్ 19న ఇదే ఆరోపణలతో డీఎస్పీకి లేఖ రాసింది. ఆమె ఆత్మహత్యకు నెలల ముందు డీఎస్పీకి రాసిన లేఖలో.. రూరల్ పోలీస్ విభాగానికి చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధించారని ఆరోపించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె లేఖలో బడ్నే, సబ్-డివిజనల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లాడ్‌పుత్రేల పేర్లను పేర్కొంది. తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, ఈ విషయాన్ని దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు బడ్నేను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ లీడర్ విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో వైద్యురాలు ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహాయుతి ప్రభుత్వం పదేపదే పోలీసుల్ని కాపాడుతోందని, ఇది పోలీస్ దురాగతాలకు కారణమవుతోందని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం వైద్యురాలి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.
