Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..

  • కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అపహరణ.
  • అత్యాచారం అనంతరం యువతి హత్య
  • నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Crime

Crime

Karnataka: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక వ్యవసాయ బావి వద్ద కనుగొన్నారు. ఆగస్టు 19 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హోక్రాణి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తండ్రి తిమ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. తిమ్మారెడ్డి కుమార్తె అశ్విని తన తల్లిదండ్రులతో కలిసి పొలాల్లో పని ముగించుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. బి.ఏ డిగ్రీ పూర్తి చేసుకున్న అశ్విని, ఆ తర్వాత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో, ఒక పాత్రను తీసుకుని సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి వెతకడానికి వెళ్లిన క్రమంలో అశ్విని చెప్పులు కనిపించాయి. కుటుంబ సభ్యులంతా రాత్రంతా అశ్విని కోసం వెతికారు. ఆగస్టు 20వ తేది ఉదయం, ఒక వ్యవసాయ బావి వద్ద మృతదేహం కనిపించింది.

అశ్విని శరీరంపై గాయాలు అయ్యాయి, బట్టలు లేని స్థితిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనలో గుండ్యా (22), మహంతేశ్ (22), వీరేశ్ (23), ముండర్గి బసవరాజ్ (సుమారు 45) నిందితులుగా ఉన్నారు. వీరంతా ఇదే గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అశ్వినికి ఈ ఘటనకు సుమారు నెల రోజుల ముందే నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.