Karnataka Police Inspector Assaulted His Sister In Law From Five Years: అతనో పోలీస్ అధికారి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న అతను, ప్రజలకు రక్షణ కల్పించాలి. ఏ సమస్య వచ్చినా.. అండగా నేనున్నానంటూ తన బాధ్యతల్ని నిర్వర్తించాలి. కానీ.. అందుకు భిన్నంగా, కామంతో కళ్లు మూసుకుపోయిన అతగాడు కీచకుడిగా అవతారం ఎత్తాడు. సహాయం కోసం వచ్చిన ఓ యువతి(వరుసకు మరదలు అవుతుంది)పై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఐదుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. అంతటితో ఆగకుండా.. తాను చేసినట్టు చేయకపోతే చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. చల్లకేరే పోలీస్ స్టేషన్‌లో ఉమేష్ అనే వ్యక్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరుసకు మరదలు అయ్యే ఓ యువతి.. ఐదేళ్ల క్రితం అతని పోలీస్ స్టేషన్‌లో ఆస్తి తగాదాల విషయమై ఫిర్యాదు చేసింది. బంధువు అవుతాడు కాబట్టి.. త్వరగా పని చేసి పెడతాడనే నమ్మకంతో ఉమేష్ సహాయం కోరింది. అయితే.. అతడు మాత్రం ఆ ఆస్తి సమస్యను పరిష్కరించే ముసుగులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం మాయమాటలు చెప్పాడో ఏమో తెలీదు కానీ.. ఆ యువతిని లొంగదీసుకున్నాడు. ఐదేళ్లుగా ఆమెని లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడే కానీ.. ఆ ఆస్తి సమస్యని మాత్రం పరిష్కరించలేకపోయాడు. ఇక ఉమేష్ వేధింపులతో విసుగెత్తిపోయిన ఆ యువతి.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గత ఐదేళ్ల నుంచి ఉమేష్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. అతడు తన మేనమామ కుమారుడని, వరుసకు బావ అవుతాడని కూడా తెలిపింది. తాను ఐదుసార్లు గర్భం దాల్చగా.. ఉమేష్ అబార్షన్ చేయించాడని చెప్పింది. అతనికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, తనని మూడో పెళ్లి చేసుకుంటానని కోరుతూ వచ్చాడని వెల్లడించింది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే.. తనకు ఆస్తి దక్కకుండా చేస్తానని, తల్లిదండ్రుల్ని వీధుల్లోకి లాగుతానని బెదిరించాడని చెప్పింది. చెప్పినట్లు వినకేంటే.. చంపేస్తానని కూడా హెచ్చరించినట్లు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. ఉమేష్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే.. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.