HCU Laptops Theft: చదువుతున్న వర్సిటీకే స్కెచ్.. 60 ల్యాప్‌టాప్‌తో జంప్.. ప్లాన్ మామూలుగా లేదు..

Hcu

Hcu

Hyderabad Central University Laptop Theft: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దొంగలు పడ్డారు. యస్.. మీరు విన్నది కరెక్టే. క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులే ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీగా ల్యాప్‌టాప్‌‌ల చోరీ వెలుగులోకి రావడం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న క్యాంపస్‌లోనే చదువుతున్న విద్యార్థులు ఒక పథకం ప్రకారం కంప్యూటర్ ల్యాబ్‌లోని 60 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

READ MORE: Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..

యూనివర్సిటీలోని సీఆర్ రావు ఏఐఎంసీఎస్ విభాగంలోని కంప్యూటర్ ల్యాబ్‌ను లక్ష్యంగా చేసుకుని నిందితులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చోరీకి ఒక రోజు ముందు ఇద్దరు విద్యార్థులు కారును తీసుకువచ్చి ల్యాబ్ సమీపంలో పార్క్ చేసి పరిస్థితులను గమనించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కవరేజ్‌పై వారికి ముందస్తుగానే అవగాహన ఉంది. దీంతో కెమెరాలకు చిక్కకుండా అర్ధరాత్రి సమయంలో క్యాంపస్‌లోకి ప్రవేశించారు.. ల్యాబ్ కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు అక్కడ ఉన్న 60 ల్యాప్‌టాప్‌లను రెండు కార్లలో లోడ్ చేశారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తరలించి మరుసటి రోజు కార్లతో బయటకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా 60 ల్యాప్‌టాప్‌లు మాయం కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఖంగుతింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్‌ల ద్వారా పోలీసుల కదలికలను గమనించిన విద్యార్థులు కారును గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ మార్చినట్లు విచారణలో తేలింది.

READ MORE: Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఊరట.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు..

అంతే కాదు.. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను నిందితులు బెంగళూరుకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 55 ల్యాప్‌టాప్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగతా ల్యాప్‌టాప్‌ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్‌ సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సాయి చరణ్‌ , అశ్విన్‌రావును అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోంది.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఇలాంటి చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు..