Site icon NTV Telugu

Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..

Hyderabad Atm Cash

Hyderabad Atm Cash

Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా దోచేశాడు.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.. చోరీ చేసిన సొమ్ముతో షాపింగ్‌లు, జల్సాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు..!! ఏం చోరీ చేశాడో తెలుసుకుందాం.. హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలో పట్టపగలే ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనాన్ని అందులో పని చేస్తున్న డ్రైవరే ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసు ఒక్కసారిగా సిటీలో సంచలనంగా మారింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్‌లో దాదాపు రూ.60 లక్షల నగదు ఉన్నట్లుగా మేనేజ్‌మెంట్ చెబుతోంది.. ఏటీఎం చోరీ కేసులో నగదును ఎత్తుకెళ్లిన డ్రైవర్‌ అజీత్‌ అలియాస్‌ శివ గత 10 రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు..

READ MORE: V.K. Sasikala : తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ నయా ఇన్నింగ్స్.. కొత్త పార్టీ ఏర్పాటుకు శశికళ రంగం సిద్ధం..

నగదు రవాణా చేసే CMS కంపెనీలో డ్రైవర్‌గా ఆరు నెలల క్రితం అజీత్ ఉద్యోగంలో చేరాడు. గోపన్‌పల్లి పరిధిలోని ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు కోటి రూపాయలకుపైగా నగదుతో డ్రైవర్ అజీత్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది క్యాష్ వ్యాన్‌లో బయలుదేరారు. గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి సెక్యూరిటీ సిబ్బంది, క్యాషియర్‌లు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో డ్రైవర్ అజీత్ ఒంటరిగా వాహనం దగ్గరకు వచ్చి క్యాష్‌తో ఉన్న వ్యాన్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే CMS సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దొంగిలించిన వాహనాన్ని అజీత్ తెల్లాపూర్ సమీపంలో వదిలి, నగదు ఉన్న ట్రంకు పెట్టతో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు నేరుగా ముంబైకి వెళ్లి కొన్ని రోజులు షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.

READ MORE: Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!

ఆ తర్వాత బెంగళూరుకు చేరుకుని అక్కడి మాల్స్‌లో కూడా కొనుగోళ్లు చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటివరకు వందకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అజీత్‌ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ముందుగానే పథకం వేసుకుని CMS కంపెనీలో ఉద్యోగంలో చేరి ఈ దోపిడీకి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడికి మరెవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు..

Exit mobile version