NTV Telugu Site icon

Bengaluru Woman Murder: ఫ్రిజ్‌లో తెగిన తల, కాళ్లు, చేతులు.. దుర్వాసనతో మహిళ దారుణహత్య వెలుగులోకి..

Bengaluru Woman Murder

Bengaluru Woman Murder

Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్‌లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య జరిగి 4-5 రోజులు అయినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భర్తతో విడిపోయిన మహాలక్ష్మీ ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. స్థానికంగా ఉన్న ఓ మాల్‌లో పనిచేస్తున్న మహాలక్ష్మీని ఒక వ్యక్తి బైక్‌పై పికప్, డ్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రస్తుతం అతడే ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు.

Read Also: Fake Notes: సినిమాలో చూసి.. దొంగ నోట్ల ముద్రణ.. చివరికి ఏమైదంటే?

ఎలా తెలిసింది..?

ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నక్రమంలో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మీ తల్లి, సోదరిని ఇంటి యజమాని పిలిపించుకున్నాడు. ముగ్గురూ కలిసి తలుపులు బద్ధలుకొట్టి చూశారు. ఫ్రిజ్ నుంచి కారుతున్న రక్తాన్ని చూసిన ముగ్గురూ…ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడగా అందులో మహాలక్ష్మీ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేసి కనిపించడంతో వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి తల్లి, సోదరి సంఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం మహాలక్ష్మీ కుటుంబం నేపాల్‌ ఖాట్మాండులోని టికాపూర్ గ్రామానికి చెందినది. 35 ఏళ్ల నుంచి బెంగళూర్‌లోని నేలమంగళలో నివసిస్తున్నారు. మహాలక్ష్మీ తల్లిదండ్రులకు నలుగురు సంతానం. మొదటి కూతురు లక్ష్మీ, సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని, షాహిదా బుష్రాగా మారింది. మృతురాలు మహాలక్ష్మీ రెండో కూతురు . ఈమెకు హేమంత్ దాస్‌తో వివాహం జరిగింది. వీరిద్దరికి విభేదాలు రావడంతో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. మూడో కుమారుడు ఉక్కమ్ సింగ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. నాలుగో వ్యక్తి నరేష్ తమతోనే ఉంటున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తన కుమార్తె చివరిసారిగా సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఫోన్ చేసినట్లు ఆమె తల్లి చెప్పారు. సెప్టెంబర్ 12న ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.