NTV Telugu Site icon

Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..

Penny, A Dobermann

Penny, A Dobermann

Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్‌మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.

Read Also: Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..

ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన బుధ సోలంకి, విక్రమ్ సోలంకి డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న రాత్రి సమయంలో ఇంటి కిటికీల దగ్గర ఇటుకల్ని తీసి ఇంట్లోకి ప్రవేశించి, డబ్బును దొంగతనం చేశారు. మరుసటి రోజు ఉదయం దొంగతానికి సంబంధించిన సమాచారం అందిందని, ఆ ప్రాంతంలో 30 మంది అనుమానితులు, 14 మంది హిస్టరీ షీటర్లను విచారించడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

గురువారం పోలీస్ డాగ్ పెన్నీ బుధ ఇంటికి కొంతదూరంలో ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది. అప్పటికే బుధ తమ అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులు అంతా ఒక వరసలో నిలబడ్డారు. ఇందులో బుధ సోలంకి కూడా ఉన్నాడు. పెన్నీ అతడి వద్దకు వచ్చి ఆగిపోయింది. పోలీసులు బుధ ఇంటిని చెక్ చేయగా.. రూ.53.9 లక్షలు కనుగొన్నారు. తాము దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు, ఈ చోరీలో విక్రమ్ సోలంకి ప్రమేయం ఉందని సమాచారం ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని విక్రమ్ ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. రైతు తన ఇంటికి దూరంగా వెళ్తాడని బుధకు ముందే తెలుసు. దీంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం డబ్బులు కొట్టేశారు. దొంగతనం తర్వాత సమానంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.