Site icon NTV Telugu

Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..

Himacjal

Himacjal

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది.

ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్‌కు పాల్పడ్డారని , ఆమెను బెదిరించారని ఆరోపించారు. కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను కూడా ఫిర్యాదులో నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన మరియు మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని తండ్రి ఆరోపించారు.

Read Also: Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..

డిసెంబర్ 26న లూథియానాలోని ఆస్పత్రిలో మరణించడానికి ముందు, బాధితురాలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిందని ఆమె కుటుంబం తెలిపింది. తన కుమార్తె మరణంతో షాక్‌లో ఉన్న తాను ముందుగా ఫిర్యాదు చేయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. తమ కుమార్తె చనిపోయే ముందు మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. ప్రొఫెసర్ అనుచితంగా తాకడం, క్యాంపస్‌లో మానసిక వేధింపుల గురించి మృతురాలు బాధను వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 20న పోలీసులు, ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని తండ్రి వెల్లడించారు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని చికిత్స పొందిన అన్ని ఆస్పత్రుల్లో విచారణ జరుగుతోంది. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై వేరే కథనాన్ని చెబుతోంది. సదరు మహిళ మొదటి ఏడాది ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కోరిందని పేర్కొంది. ఆమె తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా ఆరోపించారు.

Exit mobile version