ఆదివాసి కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క జాతరకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం జాతరకు నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సమక్క సారక్కలను దర్శించేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణకే సమక్క సారక్క జాతర తలమానికంగా నిలిచింది. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీస్ శాఖ 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బీ.రమేశ్ మేడారం జాతరకు బందోబస్తు నిమిత్తం వచ్చాడు.
అయితే ఈ రోజు ఉదయం సమక్క సారక్క టెంపుల్ ఎగ్జిట్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఉదయ 6 గంటల సమయంలో ఉన్నట్టుండి రమేశ్‌కు గుండెపోటు రావడంతో స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే రమేశ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతదేహాన్ని పోలీసు అధికారులు అంబులెన్స్‌లో రమేశ్ ఇంటికి పంపించారు. అప్పటివరకు తమతో విధులు నిర్వహించిన సహుద్యోగి హఠాత్తుగా మరణించడంతో పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.