NTV Telugu Site icon

Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..

Serial Killer

Serial Killer

Serial killer: పంజాబ్‌లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్‌పూర్‌ జిల్లాలో గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులందరూ పురుషులే అని, వారితో కిల్లర్ లైంగిక చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, నిందితుడు ఆ వ్యక్తుల్ని దోచుకునే వాడు. డబ్బులు ఇవ్వడానికి బాధితులు నిరాకరించిన పక్షంలో వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు, బాధితుల గొంతుకు వస్త్రాన్ని బిగించి చంపారు. కొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని అధికారులు తెలిపారు.

Read Also: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)

ఒక హత్యలో నిందితుడు చంపేసిన వ్యక్తి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. హత్యకు గురైన వ్యక్తి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. ఆగస్టు 18న టోల్‌ప్లాజా మెడ్రా వద్ద టీ, నీళ్లు అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్ల వెల్లడైంది. ఇప్పటి వరకు 5 కేసుల్ని నిర్ధారించగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు రూపనగర్, హోషియార్‌పూర్, ఫతేగర్ జిల్లాల ప్రజల్ని హత్య చేశాడు. కూలీ పనులు చేసుకునే కిల్లర్ డ్రగ్స్‌కి బానిసైనట్లు అధికారులు తెలిపారు. చంపిన తర్వాత పశ్చాత్తాపంతో మరణించిన వ్యక్తుల పాదాలకు నమస్కరించి, క్షమించమని కోరే వాడని, మద్యం మత్తులో ఉన్న తర్వాతే నేరాలకు పాల్పడుతున్నాడని నిందితుడు వెల్లడించాడు. నిందితుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, స్వలింగ సంపర్కం కారణంగా రెండేళ్ల క్రితం అతడి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.

Show comments