Tamil Nadu: తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిందితుడ్ని కేవలం 6 గంటల్లో పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ‘‘బంగారు ఉంగరం’’ కీలకంగా మారింది. గుర్తుతెలియని మహిళను గుర్తించేందుకు ఆ ఉంగరంపై ఉన్న హాల్ మార్క్ వివరాలు పోలీసులకు ఉపయోగపడ్డాయి. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో నిరుపయోగంలో ఉన్న రైల్వే బోగీలో 54 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 13 అర్ధరాత్రి ఈ నేరం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి వివరాలు చెప్పిన గోల్డ్ రింగ్..
మృతురాలి వివరాలను ముందుగా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈక్రమంలో పాము ఆకారంలో ఉన్న బంగారు ఉంగరం వారి దృష్టిలో పడింది. దానిపై ఉన్న హాల్ మార్క్ వివరాలే కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాయి. ఉంగరం పై ఉన్న హాల్ మార్క్ ఆధారంగా దాని మూలాలు గుజరాత్‌లో గుర్తించారు. దీనిని అమ్మిన వ్యాపారిని సంప్రదించగా.. దీనిని ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ రిటైలర్‌కు సరఫరా చేసినట్లు వెల్లడివంచారు. దీని ఆధారంగా మహిళ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత మూడు నెలలుగా ఆమె స్వస్థలంలో కనిపించకుండా పోయిందనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు కన్యాకుమారికి బయలుదేరారు.
6 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు..
మృతురాలి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అత్యంత వేగంగా గుర్తించారు. తొలుత ముగ్గురు అనుమానితులపై పోలీసులు దృష్టి పెట్టారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఈ కేసులో కీలకంగా మారింది. తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రైల్వే బోగీ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తిరిగే బిచ్చగాడిగా గుర్తించారు. గతంలో అతడికి మృతురాలు కొన్ని సందర్బాల్లో ఎదురైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను నిరుపయోగంగా ఉన్న బోగీలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ధరించిన, రక్తం మరకలు ఉన్న చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించినందుకు తమిళనాడు రైల్వే డీజీపీ కె. వన్నియా పెరుమాళ్ పోలీసుల దర్యాప్తును, ముఖ్యంగా రైల్వే ఎస్పీ కృషిని అభినందించారు.నిందితుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చేతులతో దాడి చేసి, ఛాతీపై తన్నడం ద్వారా హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

