GHMC Worker Lakshmamma Killed By Thugs: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మమ్మ (60) అనే జీహెచ్ఎంసీ కార్మికురాలు హత్యకు గురైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, గొంతు కోసి ఆమెని హతమార్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని నాగమాయకుంట బస్తీలో వేసి వెళ్లిపోయారు. స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ లభించిన ఆధారాల్ని క్లూస్ టీమ్ సేకరించింది. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మమ్మ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
లక్ష్మమ్మను హత్య చేసిన దుండగులు.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, కాళ్లకు ఉన్న వెండి కడియాలు ఎత్తుకెళ్లినట్టు తేలింది. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. లక్ష్మమ్మను ఎవరైనా కావాలనే హత్య చేశారా? లేక కేవలం దోపిడీ నెపంతోనే దుండగులు హతమార్చారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. లక్ష్మమ్మ మృతి పట్ల తోటి జీహెచ్ఎంసీ కార్మికులు సంతాపం ప్రకటించారు.