NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్లు.. షోరూమ్‌‌పై కాల్పులు.. రూ.10 కోట్ల డిమాండ్

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్‌స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసిన ఒక నోట్‌ను విడిచిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Solar Car: సోలార్ కార్‌లు వచ్చేస్తున్నాయి.. ఒక్క ఛార్జింగ్‌తో 1600 కి.మీ.

వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్ ప్రాంతం. పట్టపగలు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోటికి సోమవారం జితేంద్ర గోగి గ్యాంగ్‌కు చెందిన షూటర్లు.. షోరూమ్‌పై కాల్పులు జరిపారు. ఒకరు షోరూమ్‌ లోపలికి వెళ్లి బెదిరించగా.. ఇంకో ఇద్దరు బయట ఉండి గాల్లోకి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఒక నోట్‌ను అక్కడ వదిలిపెట్టారు. దోపిడీ నోట్‌లో గోగి మరో గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ ఫజ్జాతో ఉన్న ఫొటో ఉంది. దానిపై ‘‘యోగేష్ ధైయా’’, ‘‘ఫజ్జే భాయ్’’ మరియు ‘‘మోంటి మన్’’ పేర్లు మరియు ‘‘10 కోట్లు’’ అని వ్రాయబడి ఉంది. ఇలా బెదిరింపు లేఖను వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Hyderabad New Traffic Rules : ఇక హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మోతే

సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు షోరూమ్ ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖాలు కప్పబడి.. ఆయుధాలు ధరించారు. లోపలికి వెళ్లిన వ్యక్తి హెల్మెట్ ధరించి, కాగితం పట్టుకుని కనిపించాడు. అతడు షోరూమ్‌లోకి ప్రవేశించగానే.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు భయాందోళనలు సృష్టించడానికి స్పష్టంగా గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. కాసేపటికి లోపలికి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చి మరో ఇద్దరితో కలిసి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురూ వెళ్ళిపోయారు. అనంరతం వారిలో ఒకరు వెనక్కి తిరిగి మరిన్ని షాట్లు కాల్చాడు.

షూటర్లు జితేంద్ర గోగి గ్యాంగ్‌కు చెందినవారని తెలిసింది. 2021లో రోహిణి కోర్టులో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిని కాల్చి చంపగా.. జైల్లో ఉన్న అతని సహాయకుడు దీపక్ బాక్సర్ ఇప్పుడు ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ముఠాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా లింకులు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ముఠా ఈ తరహాలో వసూళ్లకు పాల్పడటం ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఢిల్లీలోని నంగ్లోయ్‌, అలీపూర్‌లో రెండు కాల్పుల ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లోనూ గోగీ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు బృందం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్‌ మాట్లాడాలి