తల్లి ప్రేమ వర్ణించలేనిది. ఎన్నేళ్లు వచ్చినా కన్నబిడ్డలు వారికి ఎప్పుడు చిన్నపిల్లలే. అయితే ఆ బిడ్డ మానసిక వికలాంగుడు అయితే.. చనిపోయేవరకు తల్లికి అతను పసిబిడ్డే. ఎదిగిఎదగని అతని బుద్ది… తల్లి తప్ప తనకు ప్రపంచంలో ఎవరు తెలియదు . అలాంటి తల్లి చనిపోతే .. ఆ కొడుకు పరిస్థితి ఏంటీ .. తన తల్లి కోసం అతను ఏం చేశాడు..?
తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ముక్కాయి అనే మహిళా తన కొడుకు బాల మురుగన్ తో కలిసి నివసిస్తోంది. బాల మురుగన్ చిన్నతనం నుంచే మానసిక వికలాంగుడు. వయసు వచ్చినా ఎదగని బుద్ధి.. దీంతో బాల మురుగన్ ని కంటికి రెప్పలా చూసుకొంటూ వస్తుంది. అయితే ఏడాది క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాల మురుగన్ ఏకాకిల మారిపోయాడు. తల్లి లేక, తిండి లేక అతడి పరిస్థితి అద్వానంగా మారింది.
నిత్యం తల్లి సమాధి వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడడం, ఆమెను పూడ్చిన మట్టిని తొలగిస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల తన తల్లి లేకపోతె ఉండలేని అతను తల్లి శవాన్ని బయటికి తీసి, ఇంటికి తీసుకొచ్చాడు. అలా ఇంట్లో తల్లి శవంతో నివసించడం మొదలుపెట్టాడు. ఇక శవం నుంచి వచ్చే దుర్వాసన చుట్టుపక్కలకు వ్యాపించడంతో వారు ఇంటిలోపల వెళ్లిచూడగా తల్లి శవంతో బాల మురుగన్ మాట్లాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తల్లి మృతదేహాన్ని ఖననం చేశారు. తన తల్లిని తనవద్ద నుంచి వేరు చేయొద్దని బాల మురుగన్ ప్రాధేయపడడం ప్రతి ఒక్కరి గుండెను కలిచివేసింది.
