Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్‌ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్‌గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
హత్యకు గురైన గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా కనుగొనబడలేదని, బాధితుడికి అతని తండ్రికి మధ్య ఏదో వివాదం ఉందని మాత్రమే తెలుసుకున్నామని, నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీ విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?
డీసీపీ(సౌత్) అంకిత్ చౌహాన్ మాట్లాడుతూ.. సంఘటన గురించి పోలీసులకు అర్దరాత్రి 12.30 గంటలకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి తర్వాత సింఘాల్ కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరణించిన గౌరవ్ సింఘాల్ పెళ్లి ఈ రోజు జరగాల్సి ఉందని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. సింఘాల్ ఫ్యామిలీ మాత్రం తమ కుటుంబంలో ఎవరిపై అనుమానం లేదని చెబుతోంది.
ఈ హత్య గురించి మొత్తం కుటుంబానికి ఎలాంటి క్లూ లేదని, ఇంటి దగ్గర ఢోల్ శబ్ధం ఉండటంతో ఎలాంటి అరుపులు కూడా వినిపించలేదని, పోలీసులు సక్రమంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యుడు జై ప్రకాష్ సింఘాల్ అన్నారు. ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉండటంతో బాధితుడు అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణం వెనక అసలు కారణం తెలుసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నామని, దీనిపై మొత్తం 5 టీములు పనిచేస్తున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
