Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. ఏం తెలియనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో చిన్న కూతురు నవనీత బాగోతం బయట పడింది. వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో జరిగిన ఘటన. వివరాల్లోకి వెళితే, బాల నర్సయ్య, బాలమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు నవనీతకి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇక, పెద్ద కూతురు లావణ్యకి అర ఎకరం భూమి ఇద్దామని చిన్న కూతురు నవనీతతో తల్లి బాలమణి చెప్పింది. తల్లి బతికి ఉంటే తన కొంత ఆస్తి అక్కకు పోతుందని మొత్తం తనకే దక్కాలని తల్లిని దారుణంగా హత్య చేసింది.
అయితే, తన తల్లి దగ్గర నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్న వ్యక్తితో కలిసి చిన్న కూతురు నవనీత హత్యకు ప్లాన్ చేసింది. తల్లిని హత్య చేస్తే అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒప్పందం చేసుకుంది. ఈ నెల 10వ తేదీన తల్లి పడుకున్న తర్వాత మొహంపై దిండు పెట్టి చిన్న కూతురు, అల్లుడు, అప్పు తీసుకున్న వ్యక్తి హత్య చేశారు. ఇక, ఈ నేరాన్ని పెద్ద కూతురిపై మోపడానికి నిందితులు మృతదేహాన్ని తునికి బొల్లారం చెరువులో ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పడేశారు. ఆ తర్వాత తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 16వ తేదీన కుళ్ళిన స్థితిలో ఉన్న బాలమణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ స్టైల్ లో విచారణ చేయగా నిందితులు నిజం ఒప్పుకోవడంతో చిన్న కూతురు నవనీత, అల్లుడు మధుతో పాటు గౌరయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.