Site icon NTV Telugu

Cyber Crime: ట్రెండ్‌ ఫాలోఅవుతోన్న సైబర్‌ నేరగాళ్లు.. 5జీ పేరుతో దోచేస్తున్నారు..!

Cyber Crime

Cyber Crime

సైబర్‌ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు.. ఇప్పుడు ప్రజల దృష్టిని ఎక్కువ ఏది ఆకర్షిస్తుంది.. వాళ్లను ఈజీగా ఎలా బురిడి కొట్టించవచ్చు అనే విషయాలు వాళ్లకు తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో.. ఎందుకంటే.. దేనిపై చర్చ సాగుతోంది.. ప్రజలను ఎలా బుట్టలో వేయవచ్చు అనే విషయాల్లో ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ముందుకు సాగుతున్నారు. భారత్‌లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. మొదట మెట్రో సిటీల్లో, పెద్ద నగరాల్లో.. ఆ తర్వాత పట్టణాల్లో ఇలా వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో టెలికం సంస్థలు ఉన్నాయి.. అయితే, 5జీ టెలికం సేవలను అదనుగా భావించిన సైబర్‌ కేటుగాళ్లు.. సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్‌ కావాలంటూ వల విసురుతున్నారు.

Read Also: Russia-Ukraine war: పుతిన్ పిలుపుతో సైన్యంలో చేరిన రష్యా పౌరులు

5జీ పేరుతో మొబైల్‌ ఫోన్ల వినియోగదారులకు వివిధ రకాల లింకులతో కూడిన ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్లు పంపుతున్నారు సైబర్‌ నేరగాళ్లు.. ఆ లింకులను క్లిక్‌ చేయండి.. ఆ తర్వాత వచ్చే ఓటీపీ వివరాలను తమకు చెప్పండి.. వెంటనే మీ సిమ్‌కార్డును అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ నమ్మబలుకుతూ మెసేజ్‌లు పంపుతున్నారు.. ఇక, అసలే 5జీ తొందరలో ఉన్న కొందరు ఆ లింక్‌లను క్లిక్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారట.. దీనిసై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. 5జీ పేరుతో వచ్చే అడ్డమైన లింక్‌లు, మెసేజ్‌లను నమ్మవద్దు.. ఆ కేటుగాళ్లు చెప్పినట్టు చేయొద్దు.. వారి ఉచ్చులో పడొద్దు.. మీ బ్యాంకు ఖాతాలు లూటీ చేసుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్‌ క్రైం పోలీసులు,

అంతే కాదు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సైబర్‌ పోలీసులు.. 5జీ సేవల పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లలోని లింకులను క్లిక్‌ చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు.. 5జీ అప్‌గ్రేడేషన్‌ పేరిట ఎవరైనా మన ఫోన్‌కు ఓటీపీలు పంపి ఆ వివరాలను చెప్పమంటే దానిని సైబర్‌నేరగాళ్ల పనిగా గుర్తించాలని సూచించారు.. 5జీ సేవలను పొందాలనుకొనేవారు నేరుగా తమ సర్వీస్‌ ప్రొవైడర్‌ స్టోర్‌ను సంప్రదించాలి.. కానీ, అప్‌గ్రేడ్‌ పేరిట వచ్చే ఎలాంటి మెసేజ్‌లను నమ్మవద్దు అంటున్నారు. కాగా, గతంలో 4జీకి మారినప్పుడు.. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లను సంప్రదించి.. కొత్త సిమ్‌లు తీసుకోవడం.. దీంతో, 4జీకి అప్‌గ్రేడ్‌ అయ్యాం.. దీంతో, గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే.. 5జీ డైరక్ట్ అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉండదు.. అదే నంబర్‌పై మరో సిమ్‌ తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మరవొద్దని చెబుతున్నారు.

మరోవైపు, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులో దేశవ్యాప్తంగా 105 ప్రదేశాల్లో సోదాలు చేశారు సీబీఐ అధికారులు.. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో… పలు రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక, అస్సాంలో సోదాలు నిర్వహించారు.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ ప్రాంతంలో సైబర్ ఫ్రాడ్ కాల్ సెంటర్ బహిర్గతమైందని చెబుతున్నారు.. కాల్ సెంటర్‌లో సుమారు 1.5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సీబీఐ అధికారులు.

Exit mobile version