Site icon NTV Telugu

Crocodile : నదిలో స్నానం చేస్తున్న మనిషిని లాక్కెళ్లిన మొసలి..

Crocodile

Crocodile

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది స్నానానికి వెళ్లిన ఓ 38 ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఖటోలి పట్టణంలోని పార్తి నదీతీరంలో బిల్లూ అనే వ్యక్తి స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. అయితే… నది నీళ్లలో మొసలి ఉన్న విషయాన్ని గమనించని బిల్లూ నదిలోకి వెళ్లాగానే మొసలి ఒక్కసారిగా అతడిపై దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లింది.

అంతేకాకుండా.. అక్కడే స్నానం చేస్తున్న మరి కొంత మంది ఇది చూసి భయాందోళన గురవుతూ.. ఒడ్డుకు చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొలునులో స్నానం చేస్తున్న బాలుడిపై దాడిచేసిన మొసలి అతడిని చంపేసింది.

Exit mobile version