Site icon NTV Telugu

కేర్ టేకర్ దాష్టికం.. 8నెలల చిన్నారిని మంచానికేసి బాది

crime

crime

ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్ చేసిన అఘాయిత్యాలను వినే ఉంటాం. పిల్లలను చావబాదడం, ఏడిపించడం లాంటివి చేస్తూ వారి ఇష్టానికి వారిని వదిలేసి కాలం గడుపుతుంటారు. తాజాగా గుజరాత్ లో ఇలాంటి దాష్టికమే వెలుగు చూసింది. కర్కశంగా ఒక మహిళ 8 నెలల చిన్నారిని హింసించిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని రాండెర్ పలాన్‌పూర్ పటియాలో నివసించే దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులే. దీంతో ఇంట్లో ఉండే 8 నెలల చిన్నారి బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని పెట్టారు. కొన్నిరోజులు బాగానే ఉన్నా ఇటీవల కొన్నిరోజుల నుంచి ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపులు ఎక్కువగా వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఇంటి యజమానికి చెప్పడంతో వారు ఇంట్లో సీసీ టీవీ కెమెరాలను పెట్టించారు. ఇక తాజాగా ఆ సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తల్లిదండ్రులకు వెన్నులో వణుకుపుట్టే సన్నివేశాలు కనిపించాయి. కేర్ టేకర్.. తమ చిన్నారిని కర్కశంగా కొట్టడం, గిచ్చడం చేస్తూ కనిపించింది. అంతేకాకుండా చిన్నారి తలను మంచానికి బాదుతూ, చిన్నారి ఏడుపును ఎంజాయ్ చేస్తోంది. ఇక వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, చిన్నారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్ టేకర్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Exit mobile version