ఒక్కగానొక్కడ కొడుకు.. ఘనంగా పెళ్ళి నిర్వహించాలని బంధుమిత్రులందరినీ తల్లిదండ్రులు ఆహ్వానించారు.. అందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.. రాత్రంతా అందరూ సంతోషంగా గడిపారు.. ఉదయమే లేచి ఇతర పనులన్నీ సిద్ధం చేసుకోవాలని అనుకొని పడుకున్నారు.. తీరా ఉదయం లేచి చూస్తే.. పెళ్ళి కొడుకు చేసిన పనికి విషాదఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత, తన గదిలోకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. హెచ్‌పీసీఎల్ (HPCL)లో పి. దినేష్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల ఇతని తల్లిదండ్రులు పెందుర్తి పెదగాడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్ళి కుదిర్చారు. ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా చేశారు. బుధవారం (మే 11) ముహూర్తం బాగుండడంతో, పెళ్ళి నిశ్చయించారు. రెండ్రోజుల నుంచే ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. బంధుమిత్రులతో ఆ ఇళ్ళంతా కళకళలాడుతోంది. మంగళవారం రాత్రి రెండు గంటల వరకూ అందరూ పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్నారు. సరదాగా సమయాన్ని గడిపారు. మరుసటి రోజు పెళ్ళి కావడంతో, పనులన్నీ దాదాపు కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఉదయం లేచి, ఇతర పనులు చూసుకుందామని ఒక్కొక్కరు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే పెళ్ళికొడుకు దినేష్.. తన గదిలోకి వెళ్ళి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్ల దినేష్ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. పెళ్ళి ముందురోజు అతను ఇంట్లో నుంచి పారిపోగా, కుటుంబసభ్యులు వెతికి తీసుకొచ్చారని అంటున్నారు. అయితే, కుటుంబసభ్యులు మాత్రం స్థానికుల మాటల్ని ఖండిస్తున్నారు. పెళ్ళి ఇష్టం లేదని గానీ, పెళ్ళి చేసుకోనని గానీ దినేష్ ఎన్నడూ తమతో అనలేదని తెలిపారు. కాకపోతే.. జీతం తక్కువనే టెన్షన్‌లో ఉండేవాడని, పెళ్ళి చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయనే ఆందోళనలో ఉండేవాడని బంధువులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.