NTV Telugu Site icon

Bihar Thief: కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. చుక్కలు చూపించిన ప్రయాణికులు

Bihar Thief

Bihar Thief

Bihar Thief: రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలులో మొబైల్‌ ఫోన్‌ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు.

బిహార్‌లోని ఖగారియాలో ఈ సంఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన సెప్టెంబర్‌ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్‌ కమల్‌ స్టేషన్‌ దగ్గరకు రాగానే దొంగ మొబైల్‌ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్‌ బెడిసి కొట్టింది. మొబైల్‌ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్‌ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. ఆ రైలు ప్లాట్‌ఫామ్‌ చివరకు చేరిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. అయితే ప్రయాణికులు దొంగ చేతిని వదిలిపెట్టలేదు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు.

మరింత గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ రైలు బోగి కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. ఆ రైలు పది కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఖగారియా స్టేషన్‌ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పారి పోయాడు. అదే కంపార్ట్‌మెంట్‌లోని కొందరు ప్రయాణికులు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణికులు దొంగపై కాస్తా జాలి చూపించాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు.